మంత్రి అనిల్ అసమర్ధత కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పరువు గంగలో కలిసింది

-నీటి ప్రాజెక్టుల వైఫల్యాల గురించి ఏడాది కాలంగా మొత్తుకుంటున్నా ప్రభుత్వంలో చలనం ఏది?

-రాష్ట్ర జలగండంగా మారిన అనిల్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

జనసేన పార్టీ నెల్లూరు సిటీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ లో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆంధ్రప్రదేశ్ లో అధ్వానంగా తయారైన ఇరిగేషన్ వ్యవస్థ గురించి ప్రస్తావించి ఇటీవల కట్ట తెగిపోయిన కడప జిల్లాలోని అన్నమయ్య డ్యామ్ గురించి ప్రస్తావించడం జరిగిందన్నారు. ఈ అంశం భారత్ లో నీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని, ఒక రాష్ట్ర ప్రభుత్వం తప్పుల కారణంగా మన దేశం పరువు పోయిందని వ్యాఖ్యానించడం జరిగిందన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇంతటి ఘోర అవమానం మన రాష్ట్రానికి జరిగితే సిగ్గుతో తల్లడిల్లి తక్షణం రాజీనామా చేయాల్సిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసలు ఏమాత్రం ఇంగితం లేకుండా వ్యంగ్యంగా ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర మంత్రి షెకావత్ ని విమర్శించడం సిగ్గుమాలిన విషయమన్నారు. గతేడాది నవంబర్ 29న కడప జిల్లాలోని అన్నమయ్య డ్యామ్ గేటు పడక అందులోని నీరు మొత్తం సోమశిలకి చేరి ఇక్కడ నాలుగున్నర లక్షల క్యూసెక్కుల నీరు సోమశిల నుండి పెన్నాకు వదిలిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ సందర్భంలో నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్ట్ నుండి ముందస్తుగా ఎందుకు నీటి విడుదల చేయలేకపోయారో, అక్కడ రిపేర్లు జరగకుండా ఉన్న పరిస్థితిని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకి జనసేన పార్టీ తరఫున నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. అదే సందర్భంలో నెల్లూరు విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన నుండి ఆ నివేదిక అందుకుని సోమశిల జలాశయం, అన్నమయ్య ప్రాజెక్ట్ అంశం మరియు ఇతర ప్రాజెక్టుల లోపాలను మీడియా ముఖంగా మాట్లాడడం జరిగిందన్నారు. అంటే ఏడాది కాలంగా ఇక్కడ నీటి ప్రాజెక్టుల్లో లోపాలు ఉంటే వాటికీ నిధులు కేటాయించి సరిచేయకుండా కాలయాపన చేసి ఈ రోజు వందలాది మంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారన్నారు. ఇంతటి ఘోరానికి కారణమైన మంత్రి అనిల్ ఏమాత్రం పశ్చాతాపం అనేదే లేకుండా 140 ఏళ్ళలో ఇంతటి వరద ఎప్పుడూ రాలేదు అంటూ వ్యంగంగా మాట్లాడడం చూస్తుంటే బాధాకరంగా ఉందన్నారు. గత 10, 15 ఏళ్ళలో ఎప్పుడూ ఇంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాలేదా, నదులకు వరదలు రాలేదా మీడియా మిత్రులు గుండెల మీద చేయి చేసుకుని ప్రశ్నించుకోవాలని కోరారు. ఇప్పుడు పెన్నా నది కారణంగా ఏర్పడిన వరద కేవలం మంత్రి అనిల్ బాధ్యతారాహిత్యం కారణంగానే అని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లను నవంబర్ 17 నాటికే ఎత్తాలని, కానీ దిగువన మంత్రి పెద్దిరెడ్డి, మంత్రి అనిల్ ల బినామీ ఇసుక లారీల కోసం ఎత్తలేదని, 100 లారీల ద్వారా రోజుకి రెండున్నర కోట్ల బినామీ సంపద కోసం ఎత్తలేదని, వరద పోటు ఎక్కువయ్యే సరికి నవంబర్ 18న గేటు ఎత్తాలని చూస్తే మరమ్మత్తులు చేయని కారణంగా తెరుచుకోలేదని దానితో కట్ట తెగి ఊర్లకు ఊర్లు మునిగిపోయాయని, వందలాది మంది ప్రజలు, వేలాది పశువులు మరణించాయని తెలిపారు. ఇంతటి ఘోర విపత్తుకి కారణమైన మంత్రి అనిల్ ని రాష్ట్ర జలగండంతో పోల్చుతూ కేతంరెడ్డి వినోద్ రెడ్డి తనదైన శైలిలో మండిపడ్డారు. ఏమాత్రం నైతికత ఉన్నా ఇంతటి ఘోరానికి కారణమైన మంత్రి అనిల్, సీఎం జగన్ లు రాజీనామా చేయాలని కేతంరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, బొబ్బేపల్లి సురేష్ నాయుడు, కాకు మురళి రెడ్డి, షేక్ ఆలియా, శిరీష రెడ్డి, జీవన్, హేమంత్ రాయల్, సందీప్, రవి తదితరులు పాల్గొన్నారు.