డంపింగ్ యార్డ్ తక్షణమే తరలించాలి: మన్యం జనసేన డిమాండ్

*చెత్త శుద్ధి లేని పాలకులు, అధికారులు
*చెత్త నుండి సంపద తయారు చేయలేరా…???
*డంపింగ్ యార్డ్ లో పొగమంటలతో ప్రజల ఇబ్బందులు
*డంపింగ్ యార్డ్ వద్ద జనసైనికులు ఆందోళన
పార్వతీపురం, మన్యం జిల్లా కేంద్రంలోని రాయగడ రోడ్డులో ఉన్న మున్సిపల్ చెత్త డంపింగ్ యార్డ్ ను తరలించాలని పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయకులు కోరారు. గత రెండు రోజులుగా మున్సిపల్ డంపింగ్ యార్డు వద్ద పొగ మంటలు ఎగిసి పడుతుండడంతో మంగళవారం వారు డంపింగ్ యార్డు వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు గొర్లి చంటి, వంగల దాలి నాయుడు, కాతా విశ్వేశ్వర రావు, పైలా లక్ష్మి, పైలా శ్రీను, బోనెల గోవిందమ్మ, బోనెల చంటి, అంబటి బలరాం నాయుడు, రాజాన పవన్, మండల శరత్, సిరిపురపు గౌరి తదితరులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పార్వతీపురాన్ని వేధిస్తున్న చెత్త డంపింగ్ యార్డ్ సమస్యను పాలకులు కనీసం పట్టించుకోలేదన్నారు. చెత్త డంపింగ్ యార్డ్ అభివృద్ధి చూపెడుతూ.. లక్షలాది రూపాయలు దోచుకున్నారన్నారు. అయినా ఫలితం లేదన్నారు. పెరిగిన పట్టణ జనాభాకు అనుగుణంగా డంపింగ్ యార్డ్ స్థలం ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ పాలకులు అటువైపు అడుగులు వేయడం లేదన్నారు. చెత్త డంపింగ్ యార్డ్ నిండిన వెంటనే నిప్పు పెట్టడం, తర్వాత మరల చెత్త వేయడం చేస్తున్నారన్నారు. కనీసం చెత్త నుండి సంపద తయారు చేసే ప్రయత్నం అధికారులు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నో మున్సిపాలిటీలు చెత్త నుండి సంపద తయారుచేసే పరిస్థితుల్లో ఉంటే, ఇక్కడ అధికారులు మాత్రం చెత్తకు నిప్పు పెడుతున్నారన్నారు. నిత్యం డంపింగ్ యార్డ్ కు నిప్పు పెడుతుండడంతో పొగమంటలతో సమీపంలోని జట్టు ఆశ్రమం, వివేకానంద కాలనీ, జగన్నాధపురం తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు కళ్ళమంటలు, గొంతునొప్పితో బాధ పడుతున్నారన్నారు. అలాగే వాహనచోదకులు రాకపోకలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. పాలకులు చిత్త శుద్ధి లేకుండా ప్రజల్ని దగా చేస్తూ.. చెవిలో పువ్వులుపెట్టి పాలన చేస్తున్నారన్నారు. దీనికి నిరసనగా వారు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తక్షణమే అధికారులు, పాలకులు స్పందించి సమస్య పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని జనసైనికులు హెచ్చరించారు.