జూబ్లీహిల్స్‌ పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు

జూబ్లీహిల్స్‌ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి కొద్దిసేపు భూ ప్రకంపనలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. రాత్రి 8.15 గంటల నుంచి 9 గంటల మధ్య దాదాపు 12 సార్లు భూమి కంపించింది. భూమిలోంచి భారీ శబ్దాలు వెలువడ్డాయి. భయాందోళనలకు గురైన పలు బస్తీలు, కాలనీల్లోని జనం ఇళ్లలోంచి బయటకు వచ్చేశారు. జూబ్లీహిల్స్, రహమత్‌నగర్, బోరబండ సైట్‌-3, ఎస్పీఆర్‌ హిల్స్, అల్లాపూర్‌ ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ప్రతిసారి ప్రకంపనలు 5 నుంచి 10 సెకన్ల పాటు కొనసాగాయని బోరబండ సైట్‌-3కి చెందిన కృష్ణారెడ్డి తెలిపారు. రాత్రి 9 గంటల తరువాత ప్రకంపనలు ఆగాక జనం ఇళ్లలోకి వెళ్లారు.

అయితే జూబ్లిహిల్స్‌ ప్రాంతానికి దగ్గరగా ఉండే బోరబండలో రాత్రి 11.25 గంటలకు మరోసారి 5సెకన్ల పాటు పెద్ద శబ్దంతో భూమి కంపించింది.  అప్పటివరకూ ఇళ్లలోనే ఉన్న జనం.. భారీ శబ్దాలు రావడంతో పాటు భూమి కంపించినట్టు అనిపించడంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే, సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియొద్దీన్‌.. బల్దియా సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. నిపుణులను పిలిపించి.. అసలేం జరిగిందో ఆరా తీశారు. ఇంటింటికీ తిరుగుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా.. భూమిలోకి ఇంకిన నీరు నేలపొరల్లో చేరడం వల్లే ఇలా జరిగిందని తేల్చారు అధికారులు. ఇది భూకంపం కాదని, ప్రజలెవరూ భయపడొద్దని సూచించారు. అక్కడికి వచ్చిన నిపుణులు కూడా అదే విషయాన్ని తేల్చి చెప్పారు.

అయితే, 2017లోనూ ఇదే తరహాలో భారీ శబ్దాలు వచ్చినట్లు బోరబండ వాసులు వెల్లడిస్తున్నారు.ఈ ఏరియాలో భూకంపాలు వచ్చే అవకాశం లేదని నిపుణులు తేల్చి చెప్పారు. అయితే, జనాల్ని మాత్రం భయం వీడలేదు. దీంతో చాలామంది అర్ధరాత్రి దాటినా రోడ్లమీదే జాగారం చేస్తూ ఉండిపోయారు. కొంత మంది భయంతో ఇళ్లకు తాళం వేసి… వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇక, రాత్రంతా ఇళ్ల బయటే గడిపిన ప్రజలు.. ఉదయం ఇళ్లలోకి పోయే ప్రయత్నాలు చేశారు.. మళ్లీ ఆ సమయంలో అదే తరహాలో భారీ శబ్దాలు రావడంతో మళ్లీ వారిలో ఆందోళన మొదలైంది.. మొత్తానికి బోరబండ వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు..