సందడిగా ‘ఏక్‌ షామ్‌ చార్మినార్‌కే నామ్‌’..

నగర ఖ్యాతికి చిహ్నమైన చార్మినార్‌ త్రివర్ణ శోభతో మెరిసిపోయింది.. నిత్యం వ్యాపారాలతోకిటకిటలాడే పాతనగరం ఆనందసాగరంలో తేలియాడింది.. సాంస్కృతిక కార్యక్రమాలు,అలరించే విన్యాసాలు కొత్త అనుభూతులిచ్చింది.. ఇక్కడి సంప్రదాయ రుచులను ఆస్వాదించేందుకు పోటీ తీవ్రమైంది..వెరసి చార్మినార్‌ సందర్శకులతో పోటెత్తింది.సండే-ఫన్‌డే తరహాలో ‘ఏక్‌ శామ్‌-చార్మినార్‌కే నామ్‌’ పేరుతో ఆదివారం నిర్వహించిన వినోద కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. చారిత్రక కట్టడం త్రివర్ణ వెలుగుల్లో మెరవగా, కట్టడానికి నాలుగుదిక్కులా విభిన్న ప్రదర్శనలు నిర్వహించారు. గాజులగలగలలతో లాడ్‌బజార్‌ అర్ధరాత్రి వరకు కిక్కిరిసిపోయింది. ప్రత్యేక పార్కింగ్‌సౌకర్యం కల్పించడంతో రణగొణధ్వనులు లేకుండా ఆదివారాన్ని ఆస్వాదించారు.

అటు సాగర తీరం… ఇటు చారిత్రాత్మక చార్మినార్‌…
నగరవాసులకు ఆదివారం సాయంత్రం కావాల్సినంత జోష్‌నిచ్చింది. ఐదు వారాలుగా ట్యాంక్‌బండ్‌పై విజయవంతంగా కొనసాగిన ‘సన్‌డే ఫన్‌డే’ తరహాలో చార్మినార్‌ వద్ద ‘ఏక్‌ శామ్‌… చార్మినార్‌ కే నామ్‌’ పేరుతో సరికొత్త అనుభూతిచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే చార్మినార్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. మొదటి రోజు కావడంతో అటు జీహెచ్‌ఎంసీ అధికారులు, సిటీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏ దిక్కున చూసినా… కనుచూపు మేర మనుషులు తప్ప వాహనాల కదలికే లేదు. ఇక హాయిగా పిల్లాపాపలతో నగరవాసులంతా ఇంతకుముందెన్నడూ పొందని అనుభూతితో మైమరచిపోయారు.

పాతనగరంలో చారిత్రక చార్మినార్‌ వద్ద తెలంగాణ సర్కార్‌ తొలిసారిగా ‘ఏక్‌ శామ్‌..చార్మినార్‌కే నామ్‌’ పేరుతో సండే ఫన్‌డే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. హైదరాబాద్‌ నగరానికే ఐకాన్‌గా ఉన్న చార్మినార్‌ నాలుగు దిక్కుల ఆదివారం సాయంత్రం పండుగ వాతావరణం నెలకొంది. వేలాది మంది సందర్శకులతో సందడిగా మారింది. ఇప్పటికే హుస్సేన్‌సాగర్‌ తీరంలో ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న సండే ఫన్‌డే సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదే తీరుగా ఆదివారం చార్మినార్‌ వద్ద ఏక్‌ శామ్‌..చార్మినార్‌కే నామ్‌ పేరుతో నిర్వహించడంతో మధ్యాహ్నం 3 గంటల నుంచే సందర్శకుల తాకిడి మొదలైంది.

నగరం నలుమూలాల నుంచి సందర్శకులు భారీగా విచ్చేశారు. పండుగ సమయాల్లో తప్ప ఇంతకు మునుపెన్నడూ చూడనీ విధంగా సందర్శకులతో చార్మినార్‌ పరిసర ప్రాంతం కిటకిటలాడింది. విదేశీయులతో పాటు చిన్నా పెద్ద తేడాలేకుండా సకుటుంబ సమేతంగా తరలివచ్చారు. చార్మినార్‌కు నాలుగు దిక్కుల భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలతో సందర్శకులను ఆకట్టుకున్నారు. చార్మినార్‌ తూర్పు వైపు గజల్‌ కార్యక్రమం, ఉత్తరం వైపు ముషాయిరా, దక్షిణం వైపు వైరటీ ఆహార పదార్థాల స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. పోలీస్‌ బ్యాండ్‌ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. కుటుంబ సమేతంగా వచ్చిన వారికి జీహెచ్‌ఎంసీ సిబ్బంది మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు.

ట్యాంక్‌బండ్‌పై అదే జోష్‌…
సాగర తీరం… ట్యాంక్‌బండ్‌పై గడిపే క్షణాలే ఎంతో మధురం. అలాంటి మధురానికి మరిన్ని హంగులను సన్‌డే ఫన్‌డే పేరుతో ప్రభుత్వం కల్పించడంతో నగరవాసులు కుటుంబ సమేతంగా పుల్‌ ఎంజాయ్‌ చేశారు. వేలాది మంది ట్యాంక్‌బండ్‌ పై ఆడుతు పాడుతూ, సరదాగా షాపింగ్‌ చేస్తూ, ఐస్‌క్రీం తింటూ హాయిగా గడిపారు. హెచ్‌ఎండీఏ అధికారులు, నగర పోలీసులు సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.