ఎన్నికలు ప్రశాంతంగా జరగడం సంతోషంగా ఉంది

ఏపిలో తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగడం పట్ల సంతోషంగా ఉందని ఆయన అన్నారు. తొలి విడత ఎన్నికలు జరిగిన పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చి స్వచ్ఛందంగా ఓట్లు వేశారని ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా పోలీసులు అందించిన సేవలు అభినందనీయమని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ అంశాన్ని పోలీసు యంత్రాంగం సవాలుగా తీసుకుందని చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకుల తీరు మంచి ఫలితాలను ఇచ్చిందని ఆయన అన్నారు. అంకిత భావంతో పనిచేసిన ఎన్నికల సిబ్బందిపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను వారు బలపర్చారని విశ్వసిస్తున్నామని వ్యాఖ్యానించారు. మిగతా విడతల ఎన్నికల్లోనూ ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.