లాజిస్టిక్ పార్క్‌తో స్థానిక యువతకు ఉపాధి: మంత్రి కేటీఆర్‌

జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారంలో నిర్మించిన రాష్ట్రంలోనే అతిపెద్ద లాజిస్టిక్‌ పార్కును రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు. హెచ్‌ఎండీఏ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ లాజిస్టిక్‌ పార్క్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు హైదరాబాద్‌లో ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్క్‌ దగ్గర ధర్నాలు చేసేవారని గుర్తుచేసిన మంత్రి తెలంగాణ వచ్చినంక కరెంట్‌ సమస్యలు పూర్తిగా తొలగిపోయినట్లు వెల్లడించారు. పారిశ్రామిక రంగాలకు నిరంతరం కరెంట్‌ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

స్థానిక యువతకు ఉపాధి, గ్రామస్తులకు ఒక్కొక్కరి 120 గజాలు..

బాట సింగారం లాజిస్టిక్‌ హబ్‌తో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. లాజిస్టిక్‌ హబ్‌కు భూమిని ఇచ్చిన బాటసింగారం గ్రామస్తులకు ఒక్కొక్కరి 120 గజాల చొప్పున భూమిని కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఇబ్రహీంపట్నంలో మరిన్ని పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కాలుష్యం పెరుగుతుందని కొందరు విషప్రచారం చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీతో పరిశ్రమల కాలుష్యాన్ని అరికడతామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ కృషితో హైదరాబాద్‌ నగరంలో తాగునీటి సమస్య తీరింది. 2048 వరకు హైదరాబాద్‌లో తాగునీటి సమస్య ఉండదన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్‌లో అన్ని మౌలిక సదుపాయాలున్నాయన్నారు. ఇక్కడ తయారయ్యే వస్తువుల ఎగుమతికి ట్రాన్స్‌పోర్టు, గోదాంల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంచండి.. ప్రజలకు అండగా ఉంటామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.