భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్

తెలంగాణాలో మావోయిస్టుల ఏరివేత దిశగా తెలంగాణ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. గుండాల మండలం దేవళ్లగూడెం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించారు. ప్రస్తుతం దేవళ్లగూడెంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

అయితే ఘటనా స్థలం నుంచి కొందరు మావోయిస్టులు తప్పించుకొని పారిపోయారన్న సమాచారంతో.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జులై 15న కూడా భద్రాద్రి జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. మణుగూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఒకరు గాయపడగా.. 10 మంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి కాల్పులు జరగడంతో భద్రాలచం ఏజెన్సీ‌లో కలకలం రేపుతోంది. మరోవైపు తెలంగాణ మావో ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ బాస్ పర్యటించారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో బుధవారం పర్యటించారు. అయితే ఆయన పర్యటనకు సంబంధించిన వివరాల్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. 45 రోజుల వ్యవధిలో రెండో సారి ఆసిఫాబాద్‌లో డీజీపీ పర్యటన కొనసాగుతోంది. అగ్రనేతల లొంగుబాటు వార్తల నేపథ్యంలో డీజీపీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.