Ind vs Eng: 578 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్…

చెన్నైలో మూడు రోజుల క్రితం మొదలైన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు ఎట్టకేలకు తన ఇన్నింగ్స్ ను ముగించింది. రెండు రోజులా, ఒక సెషన్ పాటు బ్యాటింగ్ చేసి, భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన ఇంగ్లండ్ ఆటగాళ్లు, 578 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. ఇందుకు ఇండియాకు 190.1 ఓవర్లు అవసరం అయ్యాయి. ఇక ఫాలో ఆన్ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే, ఇండియా తప్పకుండా 378 పరుగులు చేయాల్సి వుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ని ఇంగ్లండ్ గెలవడం లేదా డ్రా కావడం మినహా భారత్ గెలిచే అవకాశాలు దాదాపు లేనట్టేనని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇంగ్లండ్ ఆటగాళ్లలో రోరీ బుర్న్స్ 33, డామ్ సిబ్లీ 87 పరుగులు చేయగా, వన్ డౌన్ లో వచ్చిన డాన్ లారెన్స్ డక్కౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆపై వచ్చిన కెప్టెన్, 100వ టెస్ట్ మ్యాచ్ ని ఆడుతున్న జో రూట్ అద్భుత రీతిలో భారత బౌలర్లను ఎదుర్కొని 218 పరుగులు చేయడం ద్వారా, తన సెంచరీ మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.

ఆపై బెన్ స్టోక్స్ 82, ఓలీ పోప్ 34, జోస్ బట్లర్ 30, డామ్ బెస్ 34, జేమ్స్ ఆండర్సన్ 1, జోఫ్రా ఆర్చర్ 0 పరుగులకు అవుట్ కాగా, జాక్ లీచ్ 14 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక భారత బౌలర్లతో జస్ ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ కు మూడేసి వికెట్లు దక్కగా, ఇషాంత్ శర్మ, షాబాజ్ నదీమ్ కు రెండేసి వికెట్లు లభించాయి. మరికాసేపట్లో భారత బ్యాటింగ్ ప్రారంభం కానుంది.