భాగ్యనగరానికి నీటి అవసరాలకు భరోసా

హైదరాబాద్ తాగునీటి అవసరాలకు భరోసా కల్పించేందుకు కేశవాపురం రిజర్వాయర్‌కి సీఎం కేసీఆర్‌ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో జలమండలి అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కేశవాపురం ప్రాజెక్టు పూర్తయితే 2050 సంవత్సరం వరకు హైదరాబాద్‌కు తాగునీటి కొరత ఉండదన్నారు. ఈ రిజర్వాయర్‌కి సంబంధించి ఇప్పటికే మొదటి దశ అటవీశాఖ అనుమతులు లభించిన నేపథ్యంలో తదుపరి అనుమతుల కోసం మరింత వేగంగా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని రకాలుగా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అధికారులు ఆ దిశగా పనులు చేయాలని కేటీఆర్‌ సూచించారు.

హైదరాబాద్ నగరంలో మురికి నీటి శుద్ధీకరణ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు పలు కార్యక్రమాలకు జలమండలి శ్రీకారం చుట్టింది. జలమండలి అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ ఇందుకు సంబంధించి పలు సూచనలను చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 770 ఎం ఎల్ డి ల మురికినీటి శుద్ధీకరణ కొనసాగుతున్నదని, ఇది దేశంలోని అన్ని నగరాల్లో కన్నా అత్యధికమని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం ఉన్నఎస్టీపీ లకి అదనంగా మరో పన్నెండు వందల ఎం ఎల్ డి ల ఎస్టీపీల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.