కంప్యూటర్ యుగంలో సైతం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందే

  • రైతులు, రైతు కూలీలు లక్ష్య సాధన కోసం సమిష్టిగా పని చేయాలి.
  • ఏకేయూలో జరిగిన సమావేశంలో వక్తల ప్రసంగం.

ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా జీవం ఉన్న ప్రతి జీవికి నిరంతరంగా పట్టెడన్నం అందించేందు కోసం నేటి కంప్యూటర్ యుగంలో సైతం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అఖిల భారత సామాజిక సమరసత వేదిక కన్వీనర్ శ్యాం ప్రసాద్ అన్నారు. సోమవారం ఆంధ్ర కేసరి యూనివర్శిటీ సమావేశపు హాలులో జరిగిన “వ్యవసాయం అభివృద్ది కొరకు రైతులు, రైతు కూలీల సమైక్యత లోగల ఆవశ్యకత” అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి బి.వి.ఎస్. పి.ఎం డిగ్రీ కళాశాల అధినేత బి.సూర్య నారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర కేసరి యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి హరిబాబు మాట్లాడుతూ దేశానికి వెన్నెముక అయినటువంటి రైతే రాజు అని, అయితే రైతుకు గిట్టుబాటు ధర లేని కారణంగా, చీడ పీడల కారణంగా ఫలసాయం తగ్గడం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. ప్రధాన వక్త శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం పట్ల రైతుల్లో చైతన్యం తీసుకొని రావాలని, అదే సమయంలో పశు పోషణ, పశు సంపదను వృద్ధి చేసుకుంటూ గేదెలను, గోమాతలను పెంచుతూ సేంద్రీయ వ్యవసాయాన్ని చేపట్టడం ద్వారా గణనీయ మైన వ్యవసాయ ఉత్పత్తులను పొందడం టోబాటుగా ఆరోగ్య వంతమైన వ్యవసాయ ఉత్పత్తులను పొందవచ్చునని అన్నారు. దేశంలో ఆహార ధాన్యాలకు ఎటువంటి కొరత లేకుండా ఆహార భాండాగారంగా భారతావని విరాజిల్లెందుకు అటు రైతులు,ఇటు రైతు కూలీలు సమిష్టిగా పని చేస్తూ, నిర్దేశించుకున్న వ్యవసాయ ఉత్పత్తులను పొందడం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆయన కోరారు. మరో వక్త, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఫౌండేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికముక్కు. సుబ్బయ్య మాట్లాడుతూ మారిన కాలానికి అనుగుణంగా వ్యక్తుల ఆలోచనలు, అభిప్రాయాలలో సైతం మార్పులు రావాలని, రైతు సోదరులు రైతు కూలీలతో స్నేహ పూర్వకంగా కలిసి, మెలసి ఉంటూ గణనీయమైన వ్యవసాయ ఉత్పత్తులను పొందడం తోబాటుగా ఆశించిన మేరకు ఫల సాయాన్ని కూడా పొంద వచ్చునని అన్నారు. నేటి కాలంలో కుటుంబ వ్యవస్థలో సమూలమైన మార్పులు రావడంతో భూస్వామ్య వ్యవస్థ తగ్గి పోవడం, పెద్ద రైతులు సైతం వ్యవసాయం పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించక పోవడం వల్ల చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి ప్రాంతంలో వ్యవసాయానికి ఆమోద యోగ్యమైన భూములు ఉన్నపటికీ సాగునీటి కొరత కారణంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎక్కువ భాగం మెట్ట పైర్లను మాత్రమే సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వక్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్విస్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ నిడమానూరి. కళ్యాణ చక్రవర్తి, ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఎన్.ఎస్.ఎస్.కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ తోబాటు బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this content:

Post Comment