జల జీవన్ మిషన్ ద్వారా నీటి సమస్య లేకుండా చేయొచ్చు: శ్రీమతి లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం, భోగాపురం మండలం, కొండరాజుపాలెంలో గత రెండు వారాలుగా నీటి కొరకు ఎన్నో అవస్థలు పడుతూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారి సమస్యను ప్రభుత్వంలో ఉన్న నాయకులకు మొరపెట్టుకున్నా అటు నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో, విసుగు చెందిన గ్రామస్తులు వారి సమస్యను ఎట్టకేలకు జనసేన నాయకురాలు అయిన శ్రీమతి లోకం మాధవికి మొరపెట్టుకున్నారు. సమస్య విన్న లోకం మాధవి గత పది రోజుల నుండి కొండరాజుపాలెం గ్రామానికి రోజుకు 10 ట్యాంకర్లు చొప్పున నీటి సరఫరాను అందజేస్తున్నారు. గురువారం కొండరాజుపాలెంలో పర్యటించిన లోకం మాధవి ఆ గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యను స్వయంగా చూశారు. అనంతరం లోకం మాధవి మీడియా మిత్రులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీటి సమస్య లేకుండా చేయొచ్చు అని, కానీ అధికార నాయకులు ఆ నిధులను దారి మళ్ళించారు అని దానికి కారణమే ఈరోజు కొండరాజుపాలెంలో ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య అని తెలియజేశారు. గత పది రోజులుగా తాము పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని తమకు అండగా నిలిచారని ప్రభుత్వంలో లేకపోయినా ఇంతటి కార్యక్రమం మాలాంటి పేద ప్రజల కోసం చేయడం చాలా ఆనందకరమని, ఆ కృతజ్ఞతలు వచ్చే ఎన్నికల్లో ఓటు రూపంగా మార్చి లోకం మాధవిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని ఊరి ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.