ప్రతి పదవీ ప్రజలకు మేలు చేసే ఓ బాధ్యత
• అందరినీ కలుపుకొని వెళ్లేలా పని చేయండి
• ఎన్డీయే ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి
• వ్యక్తిగత విషయాలు, కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగొద్దు
• హుందాగా, గౌరవంగా మాట్లాడండి
• మాజీ ముఖ్యమంత్రి పోలీసుల్ని బెదిరించేలా మాట్లాడుతున్నారు
• మీ పదవుల్లో చిరస్థాయిగా నిలిచేలా పనులు చేయండి
• నైపుణ్య గణన జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది
• రెండో విడత నామినేటెడ్ పోస్టులు పొందిన జనసేన పార్టీ నాయకులతో సమావేశమైన శ్రీ పవన్ కళ్యాణ్
‘పదవులు పొందిన నాయకులు పది మందినీ కలుపుకొని వెళ్లాలి.. సరికొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి.. ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా, సమర్ధంగా నిర్వర్తించాల’ని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులుగాని, అవినీతిగానీ లేకుండా పని చేయాలని చెప్పారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశంగా అప్పగించిన బాధ్యతలను ఉపయోగించుకోవాలని, పార్టీ మరింతగా ప్రజలకు దగ్గరయ్యేలా పని చేయాలన్నారు. నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల అనంతరం పోస్టులు పొందిన జనసేన నాయకులతో శనివారం మధ్యాహ్నం తన నివాసంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాట్లాడారు. నామినేటెడ్ పోస్టుల ప్రాధాన్యం, కూటమి ప్రభుత్వ విధివిధానాలను వివరించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘’అన్ని కులాలకు చెందిన ప్రజలు ఆదరిస్తేనే నాయకుడు అవుతారు. ప్రజలను కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా చూడాలి. అలాంటి కీలకమైన బాధ్యతలు నామినేటెడ్ పోస్టుల ద్వారా వచ్చాయి. ఇచ్చిన పదవుల ప్రాధాన్యాన్ని, అధికారాలను, దాని ద్వారా ప్రజలకు చేయాల్సిన మంచిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయండి. ప్రతి పదవి కింది స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్న సగటు ప్రజలకు సేవ చేసేదిలా ఉండాలి. వారికి అండగా నిలిచేలా పనిచేయాలి. కులాలను దాటి పనిచేయాల్సిన అవసరం ఉందని గుర్తు పెట్టుకోండి.
• ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం కోసం పని చేయండి
నామినేటెడ్ పోస్టులను పొందిన వారు ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యాల ప్రకారం పని చేయాలి. దానికి అనుగుణంగా మాట్లాడాలి. ఎట్టి పరిస్థితిలో ప్రోటోకాల్ మర్చిపోవద్దు. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికీ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి తగిన గౌరవం ఇస్తూ, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగండి. కేవలం జనసేన పార్టీ ప్రతినిధులుగానే కాకుండా, ఎన్డీయే ప్రభుత్వంలో భాగంగా మాట్లాడండి. మీ పదవీ కాలంలో నాలుగు, అయిదు మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉండాలి. పదికాలాల పాటు చెప్పుకొనేలా ఈ పనులు మిగిలిపోవాలి. అది వ్యక్తిగతంగానూ, ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకొస్తుంది. ప్రజలకు కూడా దానివల్ల మేలు జరుగుతుంది.
• నైపుణ్య గణాంకాలు జాతీయస్థాయి అంశం అయింది
నాకున్న నైపుణ్య గణన ఆలోచనను ఎన్నికల సమయంలో పంచుకున్నాను. యువతలోని నైపుణ్య గణాంకాలను వెలికి తీయడం ద్వారా వారి అభిరుచులను తెలుసుకోవచ్చని, వారికిష్టమైన పని చేసేందుకు వీలు కల్పించవచ్చని నేను చెప్పిన అంశం ఈ రోజు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. నేను ఈ విషయాన్ని చెప్పినపుడు నాకు ఎలాంటి పదవీ లేదు. కానీ నా ఆలోచన అందరినీ కదిలించింది. కుల గణాంకాలు కావాలి అని కొన్ని పార్టీలు కోరుతున్నాయి. దీని వల్ల రాజకీయ ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. నైపుణ్య గణాంకాలతోపాటు కుల గణాంకాలు తీసుకోవాలి. దానిలో తప్పు లేదు. ఓ వ్యక్తి పూర్తి వివరాలు తెలుసుకుంటేనే అతడి నైపుణ్యం, అభిరుచులేమిటీ, ఏ బాధ్యత ఇస్తే పూర్తి స్థాయిలో పని చేయగలడు అనేది తెలుస్తుంది. అది రాష్ట్రంలో సంపూర్ణంగా జరగాలన్నదే నా ఆలోచన.
• గత సీఎం పోలీసు వ్యవస్థను బెదిరిస్తున్నారు
ఎన్డీయే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా మాట్లాడండి. ఇష్టానుసారం సబ్జెక్టు లేకుండా మాట్లాడొద్దు. గత ముఖ్యమంత్రి ఇటీవల మీడియా సమావేశంలో పోలీసులను బెదిరిస్తున్న తీరును మనమంతా చూశాం. తమను అరెస్టులు చేస్తే సప్త సముద్రాలు దాటి వచ్చి కూడా పగ తీర్చుకుంటామన్నట్లు మాట్లాడుతున్నారు. ఇది కచ్చితంగా పోలీసు వ్యవస్థను బెదిరించడమే. సోషల్ మీడియాలో అయినా, మీడియా ముఖంగా అయినా పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలి. వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలి. ఎక్కడా మాట మీరకుండా ముందుకు వెళ్లండి. వ్యక్తిగతంగా మాట్లాడొద్దు. పాలసీల మీద, పాలసీలపైనే చర్చలు చేయండి. అంతేగాని ఎవరి ఇంట్లోని వారిపై నోరు జారొద్దు. సబ్జెక్టుపై చాలా బలంగా మాట్లాడండి. మెత్తగా ఉండొద్దు. భావ సంఘర్షణకు సిద్దంగా ఉండండి. సమాజంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే జీవనాన్ని ప్రజలు కోరుకుంటారు. శాంతిభద్రతల విషయంలో ప్రాధాన్యం ఇవ్వండి. ఏ సమస్య ఉన్నా నా పేషీ దృష్టికి తీసుకురండీ. ఆ సమస్య పరిష్కారం అయ్యేలా తప్పనిసరిగా కృషి చేద్దాం’’ అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, రెండో జాబితాలో పదవులకు ఎంపికైన శ్రీ చిల్లపల్లి శ్రీనివాస రావు, శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు, డా.పెదపూడి విజయ కుమార్, శ్రీ తుమ్మల రామస్వామి, శ్రీమతి పాలవలస యశస్వి, శ్రీ టి.సి.వరుణ్, శ్రీ చిలకలపూడి పాపారావు, శ్రీ కొరికాన రవికుమార్, పార్టీ నాయకులు శ్రీ పంచకర్ల సందీప్, శ్రీ మండలి రాజేశ్, శ్రీ చన్నమల్ల చంద్ర శేఖర్, శ్రీ పాతూరి నారాయణస్వామి మహేశ్ పాల్గొన్నారు.
• టి.టి.డి. బోర్డు సభ్యులతో భేటీ
తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీ బి.మహేందర్ రెడ్డి, శ్రీమతి అనుగోలు రంగశ్రీ, శ్రీ బి.ఆనందసాయి మర్యాదపూర్వకంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. తమకు ఈ పవిత్ర బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. తిరుమల క్షేత్రం పవిత్రతను కాపాడే బృహత్తర బాధ్యతను నియమబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వర్తించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఒక క్లిష్ట సమయంలో టీటీడీ సభ్యులయ్యారు, సనాతన ధర్మాన్ని పరిరక్షించే దిశగా మీ ప్రయాణం సాగాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం గారు పాల్గొన్నారు.