‘ధరణి’ సర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలి

వ్యవసాయేతర ఆస్తుల సర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియ నేపథ్యంలో ఆదివారం ఆయన దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధి డీ పోచంపల్లిలో మున్సిపల్‌ అధికారులు చేపట్టిన సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తమ ఇండ్లకు నివాస హక్కులు లేకుండా అభద్రతా భావంతో ఉన్న ప్రజలకు హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పంచాయతీ, మున్సిపాలిటీల్లో నాన్‌అగ్రికల్చర్‌ ఆస్తులకు పాసుపుస్తకాలు జారీ చేస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌, దుండిగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఎంఎన్‌ఆర్‌ జ్యోతి, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.