తప్ప తాగిస్తూ… తప్పుడు మాటలు చెబుతూ!

*మద్య నిషేధంపై జగన్‌ అబద్దాలు
* ప్రతిపక్షంలో ఒకలా… ముఖ్యమంత్రిగా ఇంకోలా
* ఏటికాయేడు పెరుగుతున్న మద్యం విక్రయాలు
* అమ్మకాల్లో అడ్డంగా దోపిడీ

మద్యం మరిగిన వాడి మాటలకు నిలకడ ఉండదు…
మద్యం ఆదాయం మరిగిన వాడి మాటలకు నిబద్ధత ఉండదు…
తాగుడు అలవాటైన వాడు మత్తులోనే అబద్దాలు చెబుతాడు…
కానీ తాగుబోతుల డబ్బు అలవాటైన వాడు మత్తులేకపోయినా అబద్దాలు చెబుతాడు…
ఈ ఇద్దరూ ఇప్పుడు ఆంధ్రా ప్రజలకు తెలుసు!
రాష్ట్రవ్యాప్తంగా గతేడాది 3,35,00,000 ఐఎంఎల్‌ కేసుల మద్యాన్ని, 1,16,00,000 బీరు కేసులను ఖాళీ చేసిన తాగుబోతుల మాటల్ని పట్టించుకోనక్కరలేదు.
కానీ గతేడాది 28,100 కోట్ల రూపాయల మేరకు మద్యం విక్రయాలు సాగించిన ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ మాటల్ని మాత్రం పట్టించుకోవలసిందే!
ఎందుకంటే… ఆయన పాదయాత్రల సమయంలో ఒకలాగా, ముఖ్యమంత్రిగా మారాక ఇంకొకలాగ మాట్లాడారు. మద్యం విషయంలో ఇప్పటికీ మాటలు మారుస్తూనే ఉన్నారు. ఒక్కసారి ఈ నిబద్ధత లేని మాటలేంటో చూద్దాం.
* ”మద్య నిషేధం చారిత్రక అవసరం. మద్యంపై ఆదాయమంటే రక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. మహిళల కంటనీరు పెట్టించే ఆదాయంతో ఎవరికీ మేలు జరగదు” అంటూ జగన్‌ 2017లో ఆదర్శాలు వల్లించారు. పాదయాత్రలో సైతం పదే పదే ఇదే చెప్పారు.
* ”మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతోంది. మేం అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం” అంటూ 2019లో ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు.
* ”మద్యంపై వచ్చే ఆదాయాన్ని ఒకేసారి పూర్తిగా తీసేయలేం. మళ్లీ ఎన్నికల నాటికి కేవలం స్టార్‌ హోటళ్లలోనే దొరికేలా పరిమితం చేస్తాం” అంటూ 2019లో ఎన్నికల్లో గెలిచాక తొలి విలేకరుల సమావేశంలో మాట మెలిక తిప్పారు.
* ”మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు వినియోగిస్తాం” అంటూ 2021లో ఆర్డినెన్స్‌ ద్వారా స్పష్టం చేశారు.
మద్యం విషయంలో ముఖ్యమంత్రి నిబద్ధత ఎలాంటిదో ఈ మాటల మతలబులే చెబుతాయి.
అధికారం అందేవరకు ఒకలాగ, అందాక ఒకలాగ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి తీరు వల్ల రాష్ట్రంలో మద్యం వినియోగం ఏమాత్రం తగ్గలేదు సరికదా, అంతకంతకు పెరుగుతూనే ఉందని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి.
రాష్ట్రంలో గత ప్రభుత్వ ఆధ్వర్యంలోని అయిదేళ్ల కాలాన్ని తీసుకుంటే రూ.75,285.97 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
అదే వైకాపా అధికారంలోకి వచ్చాక 2019 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ. 94,240 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
మధ్యలో కరోనా విజృంభించిన కాలం ఉన్నా, లాకౌట్ల లాంటి సందర్భాలు చోటు చేసుకున్న నేపథ్యంలో సైతం మద్యం అమ్మకాలు ఇంతలా పెరిగాయంటే జగన్‌ మాటలు తాగుబోతుల మాటల కన్నా కనాకష్టంగా ఉన్నాయని ఇట్టే అర్థమవుతుంది. ఈ నాలుగేళ్లలో మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే… 2019-20లో రూ. 17,707 కోట్లు, 2020-21లో రూ. 17,966 కోట్లు, 2021-22లో 21,549 కోట్లు, 2022-23లో రూ. 23,100 కోట్లు ఆదాయం లభించిందంటే ఏటికేడాది ఎలా మద్యం విక్రయాలు పెరుగుతున్నాయో ప్రత్యేకించి వేరే చెప్పక్కర్లేదు.
కేవలం మాటలే కాదు, చేతల్ని చూసినా మద్యం ద్వారా లభించే ఆదాయం మీద వైకాపా ప్రభుత్వం ఎంతగా ఆధారపడిందో స్ఫష్టమవుతుంది. ఎలాగంటే రాబోయే కొన్నేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా హామీగా చూపించి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు అప్పు చేయడమే ఇందుకు నిదర్శనం. దీన్ని బట్టి మద్యం విక్రయాలను తగ్గించడంలో కానీ, నిషేధం విషయంలో కానీ ముఖ్యమంత్రికి ఎలాంటి నిబద్ధత లేదని స్పష్టమవుతోంది.
ఇంతేకాదు… మద్యం అమ్మకాల ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వం భారీగా దోపిడీకి పాల్పడుతోందని చెప్పడానికి అసలు ఖరీదు, ఇతర ఖర్చులను చూస్తే అర్థం అవుతుంది. ఒక లెక్క ప్రకారం… రూ. 100 మద్యం అమ్మితే, ప్రభుత్వానికి 85 రూపాయల వరకు మిగులుతోంది. మద్యాన్ని తయారీదారుల నుంచి కొని, దుకాణాల్లో అమ్మి, నిర్వహణ, కమీషన్‌ లాంటి ఖర్చులన్నీ కలిపినా అయ్యేది రూ. 15 మాత్రమే. అంటే స్టేట్‌ ఎక్సైజ్‌ పన్ను, వ్యాట్, ఇతరాల రూపంలో ప్రభుత్వం మద్యం కొనుగోలుదారుల మీద దారుణమైన భారం మోపుతోందన్నమాట. ఏదైనా ఒక వస్తువు మీద పదో, ఇరవయ్యో శాతం లాభం వేసుకుని అమ్మితే అది వ్యాపారం అవుతుంది. కానీ 100 రూపాయల మద్యం అమ్ముతుంటే 85 రూపాయలు వస్తోందంటే దాన్ని దోపిడీ అనుకోవల్సిందే.
అలాంటప్పుడు ‘మహిళల కంటనీరు తెప్పించే మద్యం ద్వారా కలిగే సంక్షేమం అనర్థకారణం” అంటూ జగన్‌ పలికిన మాటలు ప్రజల్ని మభ్యపెట్టడానికి తప్ప మరెందుకూ కాదని వేరే చెప్పక్కరలేదు. పైగా ఇదే విషయాన్ని జగన్‌ అసెంబ్లీలో వక్కాణించారు కూడా. ఎలాగంటే… ”మద్యం ఆదాయాన్ని తగ్గించి సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవాలనే దుర్భుద్ధితోనే ప్రతిపక్షాలు విషప్రచారం చేస్తున్నాయి. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో అక్కచెల్లెమ్మలను మంచి చేయడాన్ని వాళ్లు సహించలేక పోతున్నారు” అంటూ ఆయన 2022లో అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. ఓ పక్క మహిళల కన్నీటికి కారణమంటూనే, మరో పక్క మహిళలకే ఖర్చు పెడతామనడం మెరమెచ్చు మాటల గారడీకి ప్రత్యక్ష ఉదాహరణ.