వైసీపీ హయాంలో ఆటల పేరిట దోపిడీ

*‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట భారీ అవినీతి
*కూట‌మి ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు ప‌ట్టం
*జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌, ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో అన్ని ప‌థ‌కాల్లోనూ అవినీతి విల‌య‌తాండ‌వం చేసిందని, ప్ర‌జాధ‌నాన్ని పార్టీ నేత‌లు లూఠీ చేశార‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి ఆరోపించారు. గురువారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ వైసీపీ క్రీడారంగం కీర్తిని పూర్తిగా మసకబారేలా చేసిందని, క్రీడాంధ్రగా ఒకప్పుడు వెలుగొందిన ఆంధ్రప్రదేశ్ ఆటల్లో వెనుకబాటు ఆంధ్రాగా నిలిచిపోయింద‌ని ఆరోపించారు. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట క్రీడాపోటీల నిర్వహణలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయ‌ని తెలిపారు. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో జ‌రిగిన కుంబ‌కోణంపై విజిలెన్స్ విచార‌ణ ప్రారంభం కావ‌డంతో అక్ర‌మార్కుల్లో అల‌జ‌డి మొద‌లైంద‌న్నారు. ఆడుదాం ఆంధ్ర‌లో కొన‌సాగిన అంతులేని అవినీతి ప్ర‌తి ప‌ధ‌కంలోనూ కొన‌సాగిన అవినీతి, క్రీడ‌ల్లో కూడా కొన‌సాగ‌టం విచార‌క‌ర‌మ‌ని బాలాజి అన్నారు. వైసీపీ హయాంలో 2023 డిసెంబరు 15న క్రీడా పోటీలు ప్రారంభం కాగా.. సుమారు 51 రోజులపాటు సాగాయి. ఖోఖో, కబడ్డీ, క్రికెట్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ తదితర పోటీలు నిర్వహించారని గుర్తు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో భారీ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వ‌చ్చాయ‌ని, దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించి.. విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిందని వెల్ల‌డించారు. వైసీపీ పాల‌న‌లో క్రీడలకు సరైన శిక్షకులను నియమించలేదని, స్టేడియాలు నిర్మించలేదని, కేంద్రం ఇచ్చే నిధులను సైతం దుర్వినియోగం చేశార‌ని ఆరోపించారు. ఆడుదాం ఆంధ్రా’ అంటూ పోటీలు పెట్టి, దానిలోనూ సిఫార్సులకే బహుమతులు ఇచ్చారని, పోటీల నిర్వహణ పేరిట రూ.150 కోట్ల ప్రజాధనం వెచ్చించి, వైసీపీ ప్రచార కార్యక్రమంలా మార్చారని, ఇందులోనూ అంతులేని అవినీతి చోటు చేసుకోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ప్ర‌జాధ‌నాన్ని వెలికి తీయ‌టానికి చ‌ర్య‌లు తీసుకున్నార‌ని వెల్ల‌డించారు. కూట‌మి ప్ర‌భుత్వంలో క్రీడ‌ల‌కు, క్రీడాకారుల‌కు స‌ముచిత స్థానం క‌ల్పించి, క్రీడాకారులకు పట్టం క‌డుతున్నార‌ని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోనూ మైదానం ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేయనుందని వివ‌రించారు. అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో క్రీడా నగరం (స్పోర్ట్స్‌ సిటీ) స్థాపించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ను గమ్యస్థానంగా ప్రభుత్వం తీర్చిదిద్దనుందని చెప్పారు.

Share this content:

Post Comment