వడ్డీతోనే రైతుల పంట రుణాలను రెన్యువల్ చేయాలి!

  • భైంసా పట్టణంలోని రాజస్వ మండల అధికారి (ఆర్.డి.ఓ)కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

ఆదిలాబాద్: బ్యాంక్ వారు రైతుల క్రాప్ లోన్ వడ్డీ మాత్రమే తీసుకొని రెన్యువల్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ సంఘం డివిజన్ అధ్యక్షులు సట్వాజి సంగే, బిసి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దండ్ల శ్రీనివాస్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా నాయకులు నవీన్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం క్రాప్ లోన్ వడ్డీ చెల్లిస్తే రెన్యువల్ చేసేవారు. కాని ఇప్పుడు బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి మరి మొత్తం డబ్బులు వడ్డీ తో సహా కట్టాలి అని ఇబ్బంది పెడుతున్నారు. అసలే గత మూడు సంవత్సరాలుగా విపత్కర పరిస్థితుల్లో రైతులు అనేక ఇబ్బందుల్లో వున్నారు. దీనికి తోడు అకాల వర్షంతో పంటలు పండక చాలా అవస్థలు పడుతున్నారు. బ్యాంక్ అధికారుల ఒత్తిడి వల్ల అవమానానికి గురై మానసికంగా క్షోభ పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా దళారులు రైతులను పక్క దారి పట్టించి లావాదేవీలకు బానిసై రైతులను మోసం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం లీడ్ బ్యాంక్ ఆఫీసర్స్ చొరవ తీసుకుని రైతుల దగ్గర నుండి వడ్డీ మాత్రమే తీసుకొని రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన యువజన నాయకులు గంగులావార్ సాయి ప్రసాద్, బబ్లూ, రైతులు శ్రీకాంత్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.