ధాన్యాన్ని సేకరించి, గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి: జయరాం రెడ్డి

అనంతపురం, అకాల వర్షాలు, వడగండ్ల వాన, గాలివానతో రాష్ట్రవ్యాప్తంగా రైతులందరూ తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేస్తూ చిత్త శుద్ధి లేకుండా రైతులకు సహాయం అందించడంలో పూర్తిగా విఫలమైంది. ఆరుకాలం రైతులు శ్రమించి పండించిన పంట కోతదశ సమయాన అకాల వర్షాలకు పంట పొలాలు దెబ్బతిని రైతులందరూ నష్టపోయారు. సంవత్సర కాలం శ్రమించి పండించిన పండ్ల తోట రైతులు వడగండ్ల వాన, గాలివాన, అకాల వర్షాలతో అరటి, మామిడి లాంటి తోటలు పూర్తిగా నేలమట్టమై రైతులు నష్టపోవడం జరిగింది. కోత కోసి కల్లాలలో ఉన్న వరి, మొక్కజొన్న లాంటి ధాన్యమంతా తడిసిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తడిసిపోయిన ధాన్యాన్ని సేకరించి, గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి. దెబ్బతిన్న పండ్ల తోట రైతులకు ప్రతి ఎకరాకు 25 వేల రూపాయలు చెల్లించాలి. గత కొంతకాలంగా ప్రతి సంవత్సరం పంట కోత దశలో అకాల వర్షాల ద్వారా రాష్ట్ర రైతాంగం పూర్తిగా నష్టపోయారు. ఎప్పటిలాగే కేవలం ప్రకటనలు చేస్తూ రైతుల ఎడల చిత్తశుద్ధి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణం దుర్మార్గం. వైసిపి ప్రభుత్వం ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా రైతులకు మాయమాటలు చెబుతూ, ప్రకటనలు, పబ్లిసిటీలు చేసుకుంటూ పోతే మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించి తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీస్తామని హెచ్చరిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు.