రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలి..!

  • రైతులు కోరిన ఎరువులను మాత్రమే సరఫరా చేయాలి
  • ఎరువులు, పురుగు మందులు స్టాండర్డ్ కంపెనీలవి అందజేయాలి
  • దమ్ము పనులకు కష్టం హైరింగ్ కేంద్రాల ద్వారా యంత్రాలను సకాలంలో అందరికీ అందుబాటులో కి తీసుకురావాలి
  • పురుగు మందులు స్ప్రే చేసేందుకు కిసాన్ డ్రోన్ స్ప్రేయర్లు అందుబాటులోకి తీసుకురావాలి
  • వ్యవసాయ సహాయ సంచాలకురాలిని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు సంబంధించి రైతులకు ఎటువంటి ఎరువుల కొరత లేకుండా చూడాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ కార్యాలయంలోని వ్యవసాయ సహాయ సంచాలకురాలు బి. శారదతో జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నా బత్తుల దుర్గాప్రసాద్ లు ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు అందించాల్సిన ఎరువులు, పురుగుమందులు, యంత్రాలు సౌకర్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు ముమ్మరంగా దమ్ము పనులు చేపడుతున్నారన్నారు. కాబట్టి రైతులకు ఇప్పుడు ఎరువులు, పురుగు మందుల అవసరం పడనుందన్నారు. కాబట్టి రైతులుగా అవసరమైన ఎరువులు పురుగు మందులకు ఎటువంటి కొరత లేకుండా రైతులు కోరినవి మాత్రమే స్టాండర్డ్ కంపెనీలవి అందజేయాలన్నారు. దీనిలో భాగంగా యూరియాతోపాటు డి ఎ పి, పొటాస్, 28-28, 20-20, 14-35, 0-35, తదితర ఎరువులు రైతు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అందజేయాలన్నారు. అంతేగాని ప్రభుత్వం తమకు నచ్చినవి రైతులపై రుద్దకూడదన్నారు. ఈ ఏడాది రైతుల కోరిన వరి విత్తనాలు సంపత్ స్వర్ణ -130 సరఫరా చేయకపోవడంతో రైతులు అధిక మొత్తాన్ని చెల్లించి బయట కొనుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. అలాగే ఎరువులు విషయంలో అటువంటి పరిస్థితి తీసుకురావద్దన్నారు. కష్టమ్ హైరింగ్ కేంద్రాల ద్వారా వ్యవసాయ పనులకు సకాలంలో అందరికీ ట్రాక్టర్లు, దమ్ము పరికరాలు తదితర యంత్రాలను అందజేయాలన్నారు. ఇక పురుగు మందులు స్ప్రే చేసేందుకు కిసాన్ డ్రోన్ స్ప్రేయర్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే రైతులు కోరిన ఎరువులు, పురుగుమందులు స్టాండర్డ్ కంపెనీలవి అందించాలన్నారు. ఈ సందర్భంగా ఆమెకు వినతిపత్రాన్ని అందజేశారు.