సంగీత దిగ్గజానికి తుది వీడ్కోలు

ఇక శెలవు అంటూ గాన గంధర్వుడు కానరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు. ఐదు దశాబ్దాల పాటు తన గానామృతంతో పాటకు వన్నె తెచ్చిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందరినీ శోకసంద్రంలో ముంచేశారు. సినీ పరిశ్రమ ఇంకా బాలు మరణవార్తను జీర్ణించుకోలేకపోతోంది.

సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు జరిగాయి. బాలు అంత్యక్రియలు ఆయనకు అత్యంత ఇష్టమైన, ఆయన సంతోషంగా గడిపిన తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌ (ఫామ్‌హౌస్‌) లో జరిగాయి. బాలు పార్థివ దేహానికి వైదిక శైవ సాంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు అంతిమ క్రతువు నిర్వహించారు. కోవిడ్‌ నేపథ్యంలో నిన్న రాత్రే బాలు పార్థీవదేహాన్ని చెన్నై శివారులోని తామరైపాక్కంలో ఉన్న ఎస్పీబీ వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. ఇవాళ ఉదయం అక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

బాలు అంతిమ సంస్కారాలకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ హాజరై నివాళులర్పించారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలును కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు తామరైపాక్కం వ్యవసాయక్షేత్రానికి భారీగా తరలిచ్చారు. కొవిడ్‌ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే అంత్యక్రియలకు అనుమతించారు. సినీ ప్రముఖులు భారతీరాజా, దేవిశ్రీ ప్రసాద్‌, మనో తదితరులు బాలు భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులర్పించారు.