బీహార్ లో ప్రారంభమైన తుది విడత పోలింగ్

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల అధ్యాయం చివరదశకు చేరుకుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా తుది విడత పోలింగ్ ఈ ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. మూడో దశలో భాగంగా రాష్ట్రంలో ఉన్న 19 జిల్లాల్లోని 78 స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. మొత్తం 1,204 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో దశలో సీఎం నితీష్ కుమార్ మంత్రివర్గంలోని 12 మంది మంత్రుల భవితవ్యం తేలనుంది. ఈరోజు మొత్తం 2.34 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీటితోపాటు వాల్మీకినగర్ లోక్‌సభ స్థానానికి కూడా ఈరోజు ఉపఎన్నిక జరుగుతున్నది.

రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాలకుగాను ఇప్పటికే రెండు దశల్లో 165 చోట్ల పోలింగ్ పూర్తయ్యింది. నవంబర్ 10న ఫలితాలు వెలువడనున్నాయి. సీఎం నితీశ్ కుమార్ ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అధికార జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భాగాస్వామ్యపక్షాలు కూటమిగా పోటీచేస్తున్నాయి.