*కూర్మ గ్రామ అగ్ని ప్రమాదంపై జనసేన నేత తంబళ్ళపల్లి రమాదేవి స్పందన
*హిందుత్వంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
శ్రీకాకుళం జిల్లా కూర్మ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందిగామ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి, ఈ ఘటన హిందూ సనాతన ధర్మం మీద జరిగిన దుర్మార్గ దాడిగా అభివర్ణించారు.
ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో ప్రజలకు భగవద్గీత బోధిస్తూ, వైదిక ధర్మాలను ప్రోత్సహిస్తూ, హిందూ సంస్కృతిని పరిరక్షించే కృషిలో నిమగ్నమై ఉన్న ఆ గ్రామాన్ని, గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్యంగా చేసుకుని అగ్ని ప్రమాదానికి గురిచేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని ఆమె పేర్కొన్నారు. “హిందుత్వం ఒక మతం కాదు, అది జీవన విధానం, ధర్మం” అని స్పష్టంగా చెప్పిన రమాదేవి, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతదేశం హిందువులకు ఏకైక శరణ్యమై ఉన్నప్పటికీ, ఇలాంటి దాడులు హిందువుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, దేశ వైభవాన్ని కూడా కలుషితం చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటువంటి ఘటనలపై ఎప్పుడూ గళం విప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. “ఇప్పుడు హిందువులంతా ఏకమై నిలబడాల్సిన సమయం ఇది. వ్యక్తిగత లాభాలు, సూడో సెక్యులరిజం పేరుతో హిందుత్వాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలను నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించాలి” అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో హిందుత్వాన్ని పరిరక్షించే దిశగా ప్రతి హిందువు చైతన్యంతో ముందుకు రావాలని, ధర్మరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని తంబళ్ళపల్లి రమాదేవి సూచించారు.
Share this content:
Post Comment