విజయవాడ: కొవిడ్‌కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలస్‌లో అగ్ని ప్రమాదం

విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు రోడ్డులోని రమేష్‌ ఆసుపత్రి కొవిడ్‌కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణ ప్యాలస్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సీపీ శ్రీనివాసులు తెలిపారు. వీరు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు సమాచారం. తీవ్రంగా శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

రమేష్‌ ఆసుపత్రి స్వర్ణపాలెస్‌ హోటల్‌ను కోవిడ్ కేర్ సెంటర్‌గా తీసుకుని వినియోగిస్తుంది. ఈ భవనంలో 40 మంది వరకు ఉండగా.. వీరిలో 30మంది కొవిడ్‌ బాధితులు కాగా 10మంది ఆసుపత్రి సిబ్బంది.

బాధితులు కిటికీల్లో నుంచి కేకలు వేస్తూ భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. బాధితులను రమేశ్ హాస్పిటల్, ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌ల్లో తరలించారు. ఘటనా స్థలoలో సహాయచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా కింది అంతస్థులో మంటలు చెలరేగి భవనం పైభాగానికి విస్తృతంగా వ్యాపించాయి. తెల్లవారుజామున 4.45-5.00 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు గాఢనిద్రలో ఉండగా మంటలు చెలరేగి ఊపిరిడాక విలవిలాడారు. మంటలకు భయపడి ఒకటో అంతస్థు నుంచి నలుగురు కిందికి దూకినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో కృష్ణయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టు సీపీ తెలిపారు. ఇప్పటి వరకూ 18 మందిని వేరే ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన ముగ్గూరు కోవిడ్ పాజిటివ్ రోగులేనని తెలుస్తోంది.