తొలిరోజు మెట్రో సేవలకు మంచి ఆదరణ

కోవిడ్-19 నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి నిలిచిపోయిన మెట్రో సేవలు సోమవారం నుంచి పునః ప్రారంబించ బడ్డాయి. తొలిరోజు కారిడార్-1(మియాపూర్-ఎల్బీనగర్)లో మాత్రమే మెట్రో సర్వీసులు నడిచాయి. సుదీర్ఘ కాలం తర్వాత అందుబాటులోకి వచ్చిన మెట్రో సేవలకు తొలిరోజు మంచి ఆదరణ లభించిందని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

తొలిరోజు కారిడార్-1లో మొత్తం 120 మెట్రో సర్వీసులు నడిచాయని… 19వేల మంది ప్రయాణికులు మెట్రో సేవలను ఉపయోగించుకున్నారని చెప్పారు. కరోనా వ్యాప్తి చెందకుండా మెట్రో అధికారులు తీసుకుంటున్న చర్యలపై ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. మంగళవారం(సెప్టెంబర్ 8) నుంచి నాగోల్-రాయదుర్గం మార్గంలోనూ మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

తొలిరోజు హైదరాబాద్ మెట్రోకు ప్రయాణికుల నుంచి స్పందన అంతగా రాలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. డిల్లీ మెట్రో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సమయ్‌పూర్ బద్‌లీ నుంచి హుడా సిటీ సెంటర్ వరకు మెట్రో రైలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కేవలం స్మార్ట్ కార్డు దారులను మాత్రమే మెట్రో ప్రయాణానికి అనుమతినిస్తున్నారు. అయితే జనాల స్పందన ఆశించినంతగా లేదు. దీంతో రైలు కోచ్‌లు ఖాళీగా దర్శనమిచ్చాయి. అయితే ప్రజల ఆదరణ క్రమంగా పెరిగే అవకాశం ఉందని.. రాబోయే రోజుల్లో ఎక్కువమంది మళ్లీ మెట్రో సేవలనే ఆశ్రయిస్తారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.