తెలంగాణలో క్షేత్ర స్థాయి సమస్యలపై దృష్టి సారించండి

• సార్వత్రిక సమరానికి సిద్ధం కావాలి

  • తెలంగాణ నాయకులు, పార్టీ శ్రేణులకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం.

తెలంగాణలో క్షేత్ర స్థాయి సమస్యల మీద దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేసి జనసేన పార్టీ ఉనికిని చాటాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచించారు. సమస్య తీవ్రత ఆధారంగా ఏ స్థాయిలో స్పందించాలి. ఏ స్థాయిలో పోరాటం చేయాలి అనే దిశగా అధ్యయనం చేయాలని తెలిపారు. ప్రతి సమస్యను జనసేన పార్టీ తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నారు. మంగళవారం హైదరాబాద్ లో పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో 12 నియోజకవర్గాలకు చెందిన పార్టీ కో ఆర్డినేటర్లతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. సంబంధిత నియోజక వర్గాల రాజకీయ, సామాజిక పరిస్థితులపై నివేదికను పవన్ కళ్యాణ్ కు అందచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి అంశాల మీద కో-ఆర్డినేటర్లకి ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి అంశంలో వీరమహిళలను, జనసైనికులను కలుపుకొని ముందుకు వెళ్లాలన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన మిగిలిన నియోజకవర్గాల నాయకులతో కూడా సమావేశం అవుతానని పవన్ కళ్యాణ్ తెలిపారు.