రోడ్డు ప్రమాదాలపై దృష్టి పెట్టండి

  • అడ్డాపుశీల వద్ద జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయండి
  • అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడండి
  • అధిక స్పీడు, ఓవర్ లోడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్స్ డ్రైవింగ్ తదితరవి నిరోధించండి
  • బ్లాక్ స్పాట్ల వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి
  • జిల్లా జాయింట్ కలెక్టర్ కోరిన జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం నియోజకవర్గం: జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలని జనసేన పార్టీ నాయకులు, ణృఛ్ జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావుని కలిసి జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. ముఖ్యంగా జిల్లాలో కొన్ని బ్లాక్ స్పాట్ల వద్ద నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా అడ్డాపుశీల గ్రామ సమీపంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. అలాగే గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతానగరం, కొమరాడ తదితర మండలాలతో పాటు పార్వతీపురం పట్టణంలోని బైపాస్ రోడ్డు, టౌన్ ఫ్లై ఓవర్, మెయిన్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్, వైకెయం కాలనీ, వెంకంపేట గోళీలు, నర్సిపురం తదితర ప్రాంతాల్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆయా రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా, పలువురు అంగవైకల్యంతో బాధపడుతున్నారన్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన బాధితుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. అలాగే పూటుగా మద్యం సేవించి వాహనాలు నడపడం, మైనర్లు వాహనాలు నడపడం, అధికలోడు, హై స్పీడ్ తో లారీలు, ఆటోలు తదితర వాహనాలు నడుపుతుండడంతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. ఆటోలు, లారీలు తదితర వాటి ద్వారా ప్రమాదాలు జరగకుండా నియంత్రించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాలను జిల్లాలో నివారించాలన్నారు. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న స్థలాల వద్ద హెచ్చరికలు, స్పీడ్ బ్రేకర్లు తదితరవాటిని ఏర్పాటు చేసి, సంబంధిత శాఖ అధికారుల నిఘా పెంచడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించి ప్రజల ప్రాణాలను రక్షించాలని కోరారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు దీనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.