‘వకీల్‌సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసుల అనుమతి నిరాకరణ

రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ‘వకీల్‌సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు. జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖరరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.

యూసుఫ్‌గూడలోని పోలీస్ లైన్స్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 3న పవన్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని ప్లాన్ చేశారు. దీనికి అనుమతి కోరుతూ జె.మీడియా పోలీసులకు లేఖ రాసింది. ఈ ఫంక్షన్‌కు 5 నుంచి 6 వేల మంది హాజరవుతారని ఆ లేఖలో నిర్వాహకులు పేర్కొన్నారు.

అయితే, రాష్ట్రంలో కరోనా మళ్లీ చెలరేగుతున్న నేపథ్యంలో సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ‘వకీల్‌సాబ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పవన్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు.