‘ఒప్పందం’ మరచి వెన్నుపోటు!

* క్రమబద్దీకరణపై ప్రభుత్వం కప్పదాటు
* ఉసూరుమంటున్న వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు
* మాట ఇచ్చి దగా చేసిన జగన్‌ సర్కార్

మోసం… దగా… కుట్ర… వెన్నుపోటు… నయవంచన…
ఈ పదాలేవీ ఆ ఉద్యోగుల పట్ల జగన్‌ ప్రభుత్వం చేసిన అన్యాయానికి అద్దం పట్టలేవు. వారి ఆక్రోశాన్ని ఆవిష్కరించలేవు.
రాష్ట్రంలో వేర్వేరు శాఖల్లో, విభిన్న రంగాల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా బతుకుతున్న వేలాది మంది ఉద్యోగుల మానసిక ఆవేదనకు అక్షర రూపం ఇవ్వాలంటే ఇలాంటి అనేక పదాలను కొత్తగా కనిపెట్టాల్సిందే. ఒకరు కాదు, ఇద్దరు కాదు… వేలాది మంది ఉద్యోగుల్లో, వారి కుటుంబాలలో ఆశలు రేకెత్తించి అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం నాలుగేళ్లుగా ఇదిగో, అదిగో అంటూ ఊరించి, కాలక్షేపం చేసి, చివరకి ఊహించని కొత్త నిబంధనతో కేవలం కొందరికే లబ్ది చేకూర్చి చేతులు దులుపుకుంది. ఆ ఉద్యోగుల ఆశలేంటో, వారికి ప్రభుత్వం చేసిన అన్యాయమేంటో తెలియాలంటే… ఒకసారి వైకాపా అధినేత జగన్‌ పాదయాత్రల రోజుల్లోకి తొంగి చూడాలి.
”మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల్లో అత్యధికుల్ని రెగ్యులరైజ్‌ చేస్తాం” అంటూ ఊరూవాడా తిరుగుతూ జగన్‌ ఇచ్చిన హామీని నమ్ముకుని వేలాది మంది ఆశలు పెంచుకున్నారు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరిన దగ్గర్నుంచి నేడో, రేపో అనుకుంటూ ఎదురుతెన్నులు చూశారు. ఆఖరికి నాలుగేళ్ల తర్వాత తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో వారిలో అత్యధికుల ఆకాంక్షలన్నీ అడియాశలుగా మారాయి.
* ఎవరీ కాంట్రాక్టు ఉద్యోగులు?
రాష్ట్రంలోని వేర్వేరు శాఖల్లో ఖాళీలను గుర్తించి, వాటి భర్తీకి ప్రకటనలు జారీ చేసి, పరీక్షలు నిర్వహించి, ఇంటర్వూలు జరిపి నియామకాలు జరపడానికి ఆలస్యం అనివార్యం అయ్యే నేపథ్యంలో ఆయా ఉద్యోగాలకు అర్హత ఉన్న వారిని తాత్కాలికంగా తీసుకుంటారు. వీరినే ఒప్పంద ఉద్యోగులంటారు. వీరు సాధారణ ఉద్యోగుల్లాగానే పని చేస్తున్నా కొన్ని సదుపాయాలు ఉండవు. వీరి సర్వీసును ఎప్పటికప్పుడు పొడిగిస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగ భద్రత కూడా ఉండదు. అలా ఏళ్ల తరబడి పని చేస్తున్న వారిని రెగ్యులర్‌ ఉద్యోగులుగా తీసుకోవాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్‌ పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో ఇలాంటి వారందరి సర్వీసును రెగ్యులరైజ్‌ చేసి, వారిని ఉద్యోగులుగా తీసుకుంటామంటూ నమ్మబలికారు. ఇది ఇలాంటి ఉద్యోగుల్లో, వారి కుటుంబాల్లో ఆశలు రేకెత్తించింది. అయితే జగన్‌ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టినప్పటికీ వీరి ఆశలు వెంటనే నెరవేరలేదు. ఇదిగో, అదిగో అంటూ ప్రభుత్వం నాలుగేళ్లుగా కాలక్షేపం చేస్తూ వచ్చింది. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పటికీ, ప్రభుత్వం విధించిన కొత్త నిబంధన వల్ల కేవలం కొద్ది మందికి మాత్రమే లబ్ది చేకూరుతోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో వేర్వేరు శాఖల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా ఉన్నవారు దాదాపు లక్ష మంది వరకు ఉంటారని అంచనా. అయితే ప్రభుత్వం 2014 జూన్‌ నాటికి అయిదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులరైజ్‌ చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో కేవలం పది వేల మందికి మాత్రమే అవకాశం కలుగుతుంది. హామీ ఇచ్చేటప్పుడు ఒకలా చెప్పి, ఇప్పుడు కొత్త నిబంధన విధించడం దారుణమైన అన్యాయమని మిగిలిన వారందరూ ఆక్రోశాన్ని వెలిబుచ్చుతున్నారు. క్రమబద్ధీకరించాల్సిన ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికే ప్రభుత్వం ఈ మెలిక పెట్టిందనే ఆరోపణలు, విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇది ఒక విధంగా మోసం చేయడమేనని అవకాశం దక్కని వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబీకులు బాహాటంగానే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క తెలంగాణలో 2014 జూన్‌ 2 నాటికి పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులనందరినీ రెగ్యులర్‌ చేయడంతో ఏపీలో అవకాశం దక్కని వారి ఆందోళనకు అంతులేకుండా ఉంది. ఈ కొత్త ఐదేళ్ల నిబంధనతో పాటు, కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్న పోస్టులను ఖాళీలుగా చూపిస్తూ కొత్త నియామకాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడంతో వీరంతా అభద్రతా భావంతో సతమతమవుతున్నారు. అన్ని విభాగాల్లో కలిపి ఒప్పంద ఉద్యోగులు 60 వేల మంది వరకు ఉండగా, ప్రభుత్వ శాఖల్లోని వారినే పరిగణనలోకి తీసుకోవడంతో కేవలం 20,079 మంది మాత్రమే ప్రభుత్వ లెక్కల్లోకి వస్తున్నారు. వీరిలో కూడా కొత్త ఐదేళ్ల నిబంధన వల్ల కేవలం 10,117 మందే రెగ్యులర్‌ అయ్యే పరిధిలోకి వచ్చారు. ప్రభుత్వ శాఖలు కాకుండా ప్రాజెక్టులు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థలు లాంటి రంగాల్లో ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి జాబితాను ప్రభుత్వం పరిగణించడం లేదు. ఔట్‌ సోర్సింగ్‌ సేవల సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్న హామీని కూడా ప్రభుత్వం అమలు చేయకపోవడంతో మరిన్ని వేల మంది తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
విద్యాశాఖలో 2000 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉండగా 800 మంది క్రమబద్దీకరణకు నోచుకోవడం లేదు. పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 316 మంది ఒప్పంద అధ్యాపకులు ఉండగా వీరిలో 110 మంది మాత్రమే రెగ్యులరైజ్‌ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న చాలా మంది క్రమబద్ధీకరణ పరిధిలోకి రాకపోవడంతో వారందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారు 1964 మంది, ఏపీ గురుకులాల్లో పనిచేస్తున్న వారు 166 మంది ఉన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌లో 15 వేలు, సమగ్ర శిక్ష అభియాన్‌లో 10,500 మంది, నైపుణ్యాభివృద్ధి సంస్థల్లాంటి కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాల్లో 18 వేల మంది వరకు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం విధించిన కొత్త నిబంధన వల్ల వీరందరిలో అత్యధికులు నిరాశలో కూరుకుపోయారు.
* ఆర్థిక భారమే అసలు కారణమా?
అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జగన్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే అవకాశం కనిపించడం లేదు. ఈ కారణంగానే ప్రతి అంశంలోనూ ఏవో కొత్త నిబంధనలు, ఆంక్షలు పెడుతూ తప్పించుకుంటోందనే ఆరోపణలు ఉన్నాయి. ఒప్పంద ఉద్యోగుల విషయంలో కూడా ఇదే జరిగిందనేది బహిరంగ రహస్యమే. ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారుల వర్కింగ్‌ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తే మొదటి ఏడాది రూ.431 కోట్లు ఖర్చవుతుందని, యూనివర్శిటీలు, సొసైటీలు, కార్పొరేషన్లు తదితర సంస్థలకు చెందిన 18 వేల మందిని రెగ్యులర్‌ చేయాలంటే మరో రూ. 632 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ చేపట్టినా పరిమితంగా మాత్రమే చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కేవలం 10,117 పోస్టులను మాత్రమే క్రమబద్ధీకరిస్తున్నట్టు పేర్కొంది.
ఒక పక్క వేలాది మంది గగ్గోలు పెడుతుండగా, ప్రభుత్వం మాత్రం ‘జగన్‌ చెప్పాడంటే చేశాడన్నమాటే’ అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఎందుకంటే వైకాపా అధినేతలకి అర్హుల ఆవేదనతో పని లేదు. అధికారం కోసం హామీలు గుప్పించడం, తీరా అమలు పరిచే సమయానికి కొత్త నిబంధనలతో కొర్రీలు పెట్టడం అలవాటేనన్న విషయం కేవలం ఒప్పంద ఉద్యోగులకే కాదు, రాష్ట వ్యాప్తంగా ఇంగితం ఉన్న ప్రజలందరికీ ఎప్పుడో తెలుసు!