అనారోగ్యంతో కన్నుమూసిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి.. సంతాపం తెలిపిన కేసీఆర్

అత్యంత నిరాడంబరమైన నేతగా, ప్రజల కోసమే చివరివరకు పాటుపడిన చిత్తశుద్ధి ఉన్న ప్రజాసేవకుడిగా గుర్తింపు పొందిన కుంజా బొజ్జి ఇక లేరు. పేదల మనిషిగా వినుతికెక్కిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న కుంజా బొజ్జి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఇటీవలే ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. పరిస్థితి విషమించడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. కుంజా బొజ్జి మృతితో నియోజకవర్గంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన భార్య లాలమ్మ మూడేళ్ల కిందట మరణించారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 

ఆయన 1985లో మొదటిసారిగా సీపీఎం ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. ఆపై 1989, 1994లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓ ఎమ్మెల్యే అయినప్పటికీ బొజ్జి నిరాడంబరతకు మారుపేరుగా నిలిచారు. చివరి వరకు అదే జీవనపంథా అనుసరించారు. నియోజకవర్గంలో సైకిల్ పై తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేవారంటే ఆయన ఎలాంటి వ్యక్తో అర్థమవుతుంది. ఆఖరికి తన పెన్షన్ ను కూడా ప్రజల కోసమే ఖర్చుచేసిన నిస్వార్థపరుడు కుంజా బొజ్జి. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సొంత ఇల్లు కూడా సమకూర్చుకోలేకపోయారు.

బొజ్జి మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తన సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కుంజా బొజ్జి… గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.