సింగరేణిలో పెను విషాదం.. బొగ్గు గని పైకప్పు కూలి నలుగురి దుర్మరణం

సింగరేణి బొగ్గుగనిలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలం శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఎస్సార్పీ-3 గనిలో బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం కార్మికులంతా విధులకు హాజరయ్యారు. గని పైకప్పు కూలకుండా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే మూడు మీటర్ల మందం, పది మీటర్ల పొడవు, మూడు మీటర్ల వెడల్పు మేర కప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో విధులకు హాజరైన ఇద్దరు సపోర్ట్‌మన్‌ కార్మికులు, మరో ఇద్దరు బదిలీ ఫిల్లర్లు శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. వీరిని టింబర్‌మన్‌ కార్మికుడు బేర లక్ష్మయ్య (60), సపోర్ట్‌మెన్‌ వి.కృష్ణారెడ్డి (59), గడ్డం సత్యనరసింహరాజు (31), రెంక చంద్రశేఖర్‌ (32)గా గుర్తించారు. ‘కోల్‌ కట్టర్‌ కార్మికులు బొగ్గును డిటోనేటర్లతో పేల్చిన తర్వాత బయటకు వెళ్లారు. తర్వాత పది నిమిషాలకు గని పైకప్పు కూలకుండా చేయడానికి నలుగురు కార్మికులు అక్కడకు వెళ్లిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో అక్కడకు సమీపంలోనే పనిచేస్తున్న కొందరు కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి సహాయక చర్యలు చేపట్టి సాయంత్రం 5 గంటలకు రెంక చంద్రశేఖర్‌ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. రాత్రి 9.30 సమయంలో మిగిలిన ముగ్గురి మృతదేహాన్ని వెలికితీశారు. సంఘటనా స్థలాన్ని కొత్తగూడెం కార్పొరేట్‌ జీఎం సుభాని, ఏరియా జనరల్‌ మేనేజర్‌ సురేశ్ తదితరులు సందర్శించారు. ఈ దుర్ఘటనపై సింగరేణి యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేసింది. ప్రమాదం అత్యంత దురదృష్టకరమని సీఎండీ శ్రీధర్‌ పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణం విచారణ జరిపి తనకు నివేదించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబీకుల్లో అర్హులైన ఒకరికి తక్షణమే వారు కోరుకున్న ప్రాంతంలో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. చనిపోయిన కార్మికులకు మ్యాచింగ్‌ గ్రాంట్‌, గ్రాట్యుటీ తదితరాలు కలిపి సుమారు 70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అందజేస్తామని ఆయన వెల్లడించారు.

సింగరేణి దుర్ఘటనపై మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలు కవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు..