నాలుగేళ్లు… నరకానికి నకళ్లు..!

* అరచకాంధ్రప్రదేశ్ ను తయారు చేసిన వైసీపీ సర్కారు
* అన్ని రంగాలు, వ్యవస్థలు నిర్వీర్యం
* పాలనలో పూర్తి వైఫల్యం

వైసీపీ పాలన మొదలై నాలుగేళ్లు… ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల వెతలకు నాలుగేళ్లు.. కర్షకుడి కన్నీటి జడికి నాలుగేళ్లు… కార్మికుల కష్టాలకు నాలుగేళ్లు… ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఇబ్బందులకు నాలుగేళ్లు.. సామాన్యుడికి పన్ను దెబ్బలు మొదలై నాలుగేళ్లు… విద్యావ్యవస్థ విచ్ఛిన్నానికి నాలుగేళ్లు… చట్టాలకు తూట్లు పొడిచి నాలుగేళ్లు.. రౌడీయిజం అధికారికమై నాలుగేళ్లు… ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోయి నాలుగేళ్లు… ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లీ నాలుగేళ్లు…
• వైసీపీ నాలుగేళ్ల పాలనలో అన్ని రంగాలు సర్వ నాశనం అయ్యాయి. డబ్బు పంచడమే పరిపాలన అన్నట్లు… బటన్లు నొక్కడమే ముఖ్యమంత్రి బాధ్యత అన్నట్లు పాలన సాగింది. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ తిరోగమన దశకు చేరుకుంది. అన్ని వర్గాల ప్రజల జీవనం వెనక్కు వెళ్లింది. పాలకులను ప్రశ్నిస్తే కేసు.. ఎదిరిస్తే దాడి అన్నట్లు పరిస్థితి తయారైంది. అదీ ఇదీ అని కాదు అన్నింట్లోనూ వైసీపీ పూర్తిగా వైఫల్యం చెందింది.
*పన్నుల బాదుడు
• నాలుగేళ్లలో వైసీపీ ప్రజలపై పన్నుల భారం వేసింది. ఆస్తి పన్నును రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం పెంచారు. ప్రతి ఏటా గృహాల ఆస్తి విలువపై 0.15 శాతం, వాణిజ్య సంస్థలు, నివాసేతర భవనాలపై 0.3 శాతం, ఖాళీ స్థలాలపై 0.05 శాతం పెంచేలా జీవో తెచ్చారు. దీంతో ఆస్తి పన్ను దాదాపు పట్టణ వాసులకు రెట్టింపు అయింది.
• చెత్త పన్ను పేరుతో ప్రతి ఇంటికి రూ.100, వాణిజ్య సంస్థలకు రూ.250 మేర వడ్డించారు. నగరాలు, పట్టణాల్లో చెత్త సేకరించే బాధ్యతను కొన్ని సంస్థలకు అప్పగించి, వారితో బలవంతంగా చెత్త పన్ను కట్టించుకునే విధానాలను స్థానిక సంస్థలు అమలు చేశాయి.
• ఆర్టీసీ ఛార్జీలు జగన్ నాలుగేళ్ల పాలనలో 3 సార్లు పెరిగాయి. విద్యుత్ ఛార్జీల భారం అధికమైంది. వైసీపీ పాలనలో సర్దుబాటు పేరుతో ఇప్పటికే 7 సార్లు భారీగా విద్యుత్తు ఛార్జీలు పెంచారు. విద్యుత్ టారీఫ్ లను మార్చారు. జగన్‌ ప్రభుత్వం పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్‌ అమలు చేస్తోంది. అత్యధిక పన్నులు ఏపీలోనే ఉన్నాయి. ఇవి కాకుండా లీటర్‌పై అదనంగా రూ.4 వ్యాట్‌, రోడ్డు అభివృద్ధి సెస్‌ లీటర్‌ కు రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వం దాదాపు రూ.20 వేల కోట్ల భారం మోపింది. త్రైమాసిక పన్ను పెంపు, గ్రీన్ టాక్స్ పేరుతో రవాణా రంగంపై భారం మోపారు. రోడ్డు పక్క ఉండే ఇళ్లకు పన్ను… తాజాగా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు వంటివీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
*అభివృద్ధి లేదు
• వైసీపీ నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని చెప్పొచ్చు. కొత్తగా వచ్చే పరిశ్రమలు లేక, వచ్చిన పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయే పరిస్థితికి తెచ్చారు. రిలయన్స్, అమర్ రాజా, జాకీ వంటి మెగా కంపెనీలతో పాటు సుమారు 18 కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. ఫలితంగా నిరుద్యోగం పెరిగిపోయింది. నిరుద్యోగ శాతం 8 శాతంగా నమోదు అయింది. జాబ్ క్యాలెండర్ విడుదల లేదు. కేవలం వైద్య ఆరోగ్యశాఖలో జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో వేసిన పోస్టులు తప్పితే, మరే ఇతర శాఖల్లోనూ పోస్టుల భర్తీ జరగనే లేదు.
• రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. బయటి ప్రాంతాల నుంచి వాహనాలు ఏపీలోకి రావాలంటేనే భయపడే పరిస్థితి తయారైంది. రాష్ట్రీయ రహదారులు, గ్రామ, పంచాయతీ రహదారులు గుంతలు తేలినా పట్టించుకున్న దాఖలాలు లేవు. 30 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు పాడైనా పట్టించుకున్న నాధుడు లేడు.
• సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకున్న దాఖలాలు లేవు. 90 శాతం పనులు పూర్తయిన వాటిని చిన్న పనులు చేసే ప్రారంభించే తీరిక, నిధులూ రెండు లేవు. అధికారంలోకి రాగానే ఏడాదిలో అప్పటి ప్రాధాన్యత ప్రకారం 4 ప్రాజెక్టులు ప్రారంభించేలా చూస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం వాటిని మళ్లీ పట్టించుకోలేదు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో రెండే ప్రాజెక్టులు ప్రారంభం అయ్యాయి.
*హామీల అమలు ఏదీ..?
• ఇచ్చిన హామీలను నాలుగేళ్లలో పూర్తి చేసింది లేదు. సీపీఎస్ తో పాటు మద్యపాన నిషేధం హామీ తుంగలో తొక్కి ప్రజల ఆరోగ్యాలతో వైసీపీ ప్రభుత్వం ఆటలాడుతోంది. అమరావతి రాజధానిగా కట్టుబడతామని చెప్పిన వైసీపీ మూడు రాజధానులు అంటూ కొద్దికాలం హడావుడి చేసి చేతులు దులుపుకుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తిపైనా మాట దాటేసింది. ప్రత్యేక స్టేటస్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కాపాడటంపైనా వైసీపీ పాలకులు కప్పదాటు వేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను నిర్వీర్యం చేసిన సర్కారు విద్యావిధానంలో మార్పుల పేరుతో ఉపాధ్యాయుల పొట్ట కొట్టంది. డీఎస్సీపై మాట తప్పిన జగన్ రెడ్డి, ఉద్యోగుల ఐఆర్, ఫిటెమెంట్ ఇచ్చే విషయంలోనూ నిలువునా మోసం చేశారు. వైసీపీకి అనుకూలంగా ఉండేవారికే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అగాధం సృష్టిస్తున్నారు.
*నేరాల్లో ఫస్ట్
• పోలీసు వ్యవస్థను తన ఇష్టానికి వాడుకుంటున్న వైసీపీ సర్కారు విపక్షాలపై దాడులను ప్రొత్సహిస్తోంది. ప్రశ్నించిన వారిపై అన్యాయంగా కేసులు పెట్టిస్తోంది. గత నాలుగేళ్లలో విపక్షాలకు చెందిన నాయకులపై 4200 కేసులు పెట్టించింది. సోషల్ మీడియాలో లేదా బయట ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా సీఐడీని రంగంలోకి దింపి, కక్షపూరిత కేసులను పెట్టిస్తోంది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టుల నుంచి వివిధ సందర్భాల్లో 95 సార్లు మొట్టికాయలు తిన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో దొరుకుతున్న గంజాయిలో 28 శాతం వరకు రాష్ట్రం నుంచి రవాణా అవుతున్నట్లు జాతీయ నేర గణాంకాలు చెబుతున్నాయి. గంజాయి రవాణాలో ఏపీని గత నాలుగేళ్లలో నంబరు 1 చేశారు. మహిళల నేరాల్లోనూ గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. 2021లో ఎన్నడూ లేనట్లుగా క్రైం రేటు పెరుగుదల డబుల్ అయింది. మీడియా ప్రతినిధులకు స్వేచ్ఛనివ్వకుండా, పోలీసులను ప్రయోగిస్తోంది. వైసీపీ నాయకుల ఆకృత్యాలు పెరిగిపోయాయి. గ్రామాల్లో రాజకీయ వాతావరణం కలుషితం చేసి, ఫాక్షన్ పరిస్థితులు తీసుకొచ్చారు. ముఖ్యంగా వైసీపీ నాయకులే ఘర్షణలు రేపి, ప్రజల్లో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అమలాపురం అల్లర్ల ఘటన, మాచర్ల ఘటనలు అందుకు తార్కాణాలు.
• చెప్పుకుంటూ పోతే వైసీపీ నాలుగేళ్ల పాలన ఆంధ్ర ప్రజలను అత్యంత దయనీయమైన స్థితికి తీసుకెళ్లింది. సుమారు 60 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.10 లక్షల కోట్లకు చేరువయ్యాయి. ఈ నాలుగేళ్లలో ఎన్నో వైఫల్యాలు… మరెన్నో తప్పిదాలు… లెక్కకు మించి దారుణాలతో వైసీపీ ఆంధ్రాను అరచాకాంధ్రప్రదేశ్ చేసింది అనడంలో సందేహం లేదు.