చిలకలూరిపేట, నగర, పట్టణాల్లో గత ప్రభుత్వం విధించిన ‘చెత్త పన్ను’ను కూటమి ప్రభుత్వం రద్దు చేయటంతో ప్రజల్లో హర్షం వ్యక్తమౌతుందని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. ఆదివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి లభించిందని, 2024 డిసెంబరు 31 నుంచి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లుగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ను జారీ చేసిందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నదని, ఇందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు చెత్తపన్నును రద్దు చేస్తున్నట్లు గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారని వెల్లడించారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో అన్ని నగర, పురపాలక సంస్థల్లో నెలకు కోట్ల మేర చెత్త పన్ను భారం ప్రజలపై తగ్గనుందని పేర్కొన్నారు. అనేక సంస్కరణల మాదిరి వైసీపీ ప్రభుత్వం చెత్తపన్ను తెరపైకి తెచ్చి ప్రజల నుంచి తీవ్ర వచ్చిందని, బహుటంగానే ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం 2021లో ప్రారంభించిన ఈ విధానంతో దాదాపు రూ.187.02 కోట్ల వరకు వసూలు చేశారని వెల్లడించారు. దీనిపై ప్రతిపక్షాలు, అన్ని వర్గాల ప్రజల వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదన్నారు. అధికారులు, సిబ్బంది బెదిరింపులు, చెత్తను తీసుకొచ్చి దుకాణాల ముందు పారబోయడం వంటివి చేసినా జనాలు వెనక్కు తగ్గలేదు. దాంతో కొన్ని ప్రాంతాల్లో బలవంతపు వసూళ్లకు దిగారని గుర్తు చేశారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా దీన్ని ముక్కుపిండి వసూలు చేశారని, ఎన్నికల సమయంలో కొన్ని ప్రాంతాల్లో పన్ను వడ్డింపు తగ్గించినా.. ప్రజల్లో వ్యతిరేకత మాత్రం తగ్గలేదన్నారు. చివరకు చెత్త పన్నులోనూ గత పాలకులు అవినీతికి పాల్పడ్డారని, చెత్త పన్ను వసూళ్లలోనూ ఈ అవినీతి చోటు చేసుకుందన్నారు. వైసీపీ ప్రభుత్వ పతనానికి చెత్తపన్ను విధింపు కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం చెత్త పన్నుతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయని పేర్కొన్నారు.
Share this content:
Post Comment