మరింత పెరిగిన గోదావరి వరద ఉధృతి

గోదావరి వరద ఉధృతి మరింతగా పెరుగుతోంది. బారీవర్షాల నేపధ్యంలో గోదావరినదీ పరివాహర ప్రాంతం లోనూ..ఉపనదులైన శబరి, ఇంద్రావతి, ప్రాణహిత  పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వచ్చిన నీటిని వచ్చినట్టే సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి..15 లక్షల 38 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలో వదులుతున్నారు. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం గోదావరి నది రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తోంది. అటు భద్రాచలం వద్ద 55 అడుగులకు నీటమట్టం చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఇంకా కొనసాగుతున్న నేపధ్యంలో వరద ఇంకా పెరగవచ్చని అదికార్లు అంచనా వేస్తున్నారు. గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తుండటంతో బ్యారేజ్ కు ఎగువన దేవీపట్నం మండలానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పోలవరం మండలంలో 19 ఏజెన్సీ గ్రామాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. విలీన మండలాలు పూర్తిగా వరదనీటిలో చిక్కుకున్నాయి. అటు బ్యారేజ్ కు దిగువన కోనసీమ లంక గ్రామాల్లో వరద నీరు చేరుతోంది. వరద ఇంకా ఇలాగే కొనసాగితే..మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు అధికార్లు.