‘గబ్బర్‌ సింగ్‌’ నా జీవితాన్ని మార్చేసింది

కెరీర్ ఆరంభంలో పలు పరాజయాలు ఎదుర్కొన్న శ్రుతీ హాసన్ పవన్ కల్యాణ్ `గబ్బర్‌సింగ్` సినిమాతో సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వరుస విజయాలు సాధిస్తూ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. అయితే ఇటీవల ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ నేను కొన్ని బ్లాక్‌బస్టర్ సినిమాల్లో భాగమయ్యాను. కానీ, నాకు అవి అంత సంతృప్తిని ఇవ్వలేదు. ఇప్పుడు నాకు నచ్చిన కథలను ఎంచుకోవడంలో నిజాయితీగా వ్యవహరిస్తున్నానని శ్రుతి పేర్కొంది.

శ్రుతి వ్యాఖ్యల ఆధారంగా కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా `గబ్బర్‌సింగ్`, `రేసుగుర్రం` వంటి సినిమాలను శ్రుతి ఇష్టపడలేదని కథనాలు రాశాయి. దీంతో శ్రుతి తాజాగా స్పందించింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ట్వీట్ చేసింది. `జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నా ఇంటర్వ్యూ గురించి తెలుగులో వచ్చిన ఆర్టికల్స్ పూర్తిగా అవాస్తవాలు. ‘నేను ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటల్ని కొన్ని తెలుగు వెబ్‌సైట్లు తప్పుగా అర్థం చేసుకున్నాయి. వీళ్లు రాసిన వార్తల్లో వాస్తవం లేదు. వాటిపై స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నా. ‘రేసు గుర్రం’, ‘గబ్బర్‌ సింగ్’ లాంటి సినిమాల్లో నటించడాన్ని ఎప్పటికీ గర్వంగా భావిస్తాను. పవన్‌ కల్యాణ్‌ గారితో కలిసి నటించిన ‘గబ్బర్‌ సింగ్‌’ నా జీవితాన్ని మార్చేసింది. తెలుగు, దక్షిణాది చిత్రాల్లో నా భాగస్వామ్యం ఉండటమంటే.. నేను నా హృదయానికి దగ్గరగా ఉండటమే (దక్షిణాదిని హృదయంతో పోల్చుతూ). నేను నటించిన హిందీ సినిమాలను ఉద్దేశించి ఆ రోజు ఇంటర్వ్యూలో మాట్లాడా’ అని శ్రుతి ట్వీట్లు చేశారు. భారత చిత్ర పరిశ్రమలో ‘సౌత్‌ వర్సెస్‌ హిందీ’ అని మాట్లాడే విషయాలు తనకు ఏ మాత్రం నచ్చవని, ఇప్పుడైనా తనను పూర్తిగా అర్థం చేసుకున్నట్లు ఆశిస్తున్నానని పేర్కొన్నారు.