కరోనా సమయంలో చేసిన సేవలకుసంతృప్తి లభించింది:సోనుసూద్‌

సినీరంగంలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ రాని పేరుప్రతిష్టలు, కరోనా సమయంలో చేసిన సేవలకు మంచి సంతృప్తి లభించిందని ప్రముఖసినీనటుడు సోనుసూద్‌ అన్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో కరోనా కష్టకాలంలో సేవలు అందించిన వారిని, స్వచ్ఛంద సంస్థలు, ప్లాస్మా దాతలను బుధవారం గచ్చిబౌలిలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి సోనుసూద్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సోనుసూద్‌కు పోలీస్‌ అశ్వదళంతో ఘనంగా స్వాగతం పలికారు.

రాష్ట్రంలో ముఖ్యంగా సైబరాబాద్‌ పరిధిలో సీపీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో పోలీసులు కొవిడ్‌ సమయంలో అందించిన సేవలు అమోఘమని సోనుసూద్‌ కొనియాడారు. సజ్జనార్‌ మాట్లాడుతూ కరోనా మహమ్మారి ఉధృతి సమయంలో ఎంతోమందిని పేదవారిని, వలసకూలీలకు కడుపు నింపడంతో పాటు వారిని స్వస్థలాలకు చేర్చడంలో సోనుసూద్‌ చేసిన కృషిని అభినందించారు. అనంతరం సోనుసూద్‌తో పాటు కరోనా కష్టకాలంలో సేవలు అందించిన వారిని, ప్లాస్మా దాతలను సీపీ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పోలీస్‌ అధికారులు, ప్రముఖ గాయని స్మిత, సంగీత దర్శకుడు అనూ్‌పరూబెన్‌ తదితరులు ప్రసంగించారు.