‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ అంబులెన్స్‌ వాహనాలను ప్రారంభించిన స్పీకర్‌

మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా చేపట్టిన ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు నేతృత్వంలో రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్ర్తీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబులెన్స్‌ వాహనాలను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన శాసన సభ్యులు అందించిన ఈ అంబులెన్స్‌ వాహనాలను సాధారణ వినియోగ దారులకు అందుబాటులో ఉంచారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులతో సహా శాసన సభ్యులంతా కలిసి మొత్తం 14 అంబులెన్స్‌లను సమకూర్చారు. ఈ వాహనాలను వారి వారి నియోజక వర్గాల్లో కరోనా బాధితుల కోసం వినియోగిస్తారు.

వీటిని నియోజక వర్గ కేంద్రాల్లో ఆసుపత్రులకు అప్పగిస్తారు. ఈ అంబులెన్స్‌ వాహనాల్లో ఆక్సీజన్‌, వెంటిలేటర్‌తో సహా, అత్యాధునిక సదుపాయాలను కల్పించారు. కరోనా బారిన పడిన సీరియస్‌ పెషెంట్లకు అవసరమైన సదుపాయాలన్నీ ఇందులో ఉన్నాయి. పబ్లిక్‌గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో పాటు పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.