చెరువులను కాపాడేలా అధికారులకు బుద్ధిని ప్రసాదించండి!

  • దర్జాగా కబ్జా అవుతున్న చెరువులు, ప్రభుత్వ స్థలాలు
  • పార్వతీపురంలో గుట్టలు గుట్టలుగా దొంగ పట్టాలు
  • నిద్దరపోతున్న రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, సచివాలయ అధికారులు, సిబ్బంది
  • మహాకవి గురజాడ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన ఉత్తర ఆంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురంలో కబ్జాకు గురవుతున్న చెరువులు, ప్రభుత్వ స్థలాలను కాపాడేలా సంబంధిత శాఖ అధికారులకు బుద్ధిని ప్రసాదించాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు రేజేటి దయామణి, పట్టణ అధ్యక్షులు సిగడం భాస్కరరావు తదితరులు మహాకవి గురజాడ విగ్రహాన్ని కోరారు. మహాకవి గురజాడ వర్ధంతి సందర్భంగా గురువారం వారు పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డు లోని రైతు బజార్ జంక్షన్లో ఉన్న గురజాడ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గురజాడ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించి, విజయం సాధించిన సాహితీవేత్త గురజాడ అన్నారు. కన్యాశుల్కం, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ తదితర రచనల ద్వారా సమాజ గమనాన్ని మార్చారన్నారు. ఆఅటువంటి గురజాడ పార్వతీపురంలో జరుగుతున్న చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలను అడ్డుకొనెలా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, సచివాలయ అధికారులకు సిబ్బందికి బుద్ధిని ప్రసాదించాలని కోరారు. కళ్ళముందే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, తాసిల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న నెల్లిచెరువు లో పక్కా భవనాల నిర్మాణాలు జరుగుతున్నా, యంత్రాలతో పునాదులు తవ్వి, రిగ్గు బోర్లు తీస్తున్నా అధికారుల చెవిన పడకపోవడం గమనార్హం అన్నారు. అలాగే మున్సిపల్ కార్యాలయానికి అడుగు దూరంలో ఉన్న దేవుడి బంధ కబ్జాలు కూడా కనిపించకపోవడం శోచనీయమన్నారు. ఇక వై.కె.ఎం. కాలనీ వద్ద ఉన్న లంకెల చెరువు, కోదువాని బంధ తదితర చెరువులు అక్రమార్కులు దర్జాగా కబ్జాలు చేస్తున్న సంబంధిత శాఖ అధికారులు నిద్రపోతున్నారన్నారు. అలాగే పార్వతీపురంలో దొంగ పట్టాలు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తూ వాటితోనే ఆక్రమణదారులు చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో పక్క భవనాలు కడుతున్నప్పటికీ జిల్లా అధికారుల సైతం నోరు మెదపకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇక ఐటీడీఏ కార్యాలయానికి ఆమడ దూరంలో ఉన్న లక్ష్యుము నాయుడు చెరువులో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను సైతం అధికారులు అడ్డుకోకపోవడం వారి చేతగానితనానికి నిదర్శనం అన్నారు. కాబట్టి మహాకవి గురజాడ వారికి ప్రభుత్వ ఆస్తులను కాపాడేలా బుద్ధిని ప్రసాదించాలని కోరి వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.