టెట్ అభ్యర్థులకు తీపి కబురు.. ఉత్తీర్ణత ఇక జీవితకాలం చెల్లుబాటు!

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసిన అభ్యర్థులకు ఇది తీపి కబురే. ఇందులో ఉత్తీర్ణత అయిన వారికి ఇచ్చే ధ్రువపత్రం ఇకపై జీవితకాలం చెల్లుబాటు కానుంది. ఇప్పటి వరకు దీని చెల్లుబాటు ఏడేళ్లు మాత్రమే కాగా, తాజాగా దీనిని జీవితకాలానికి పెంచుతున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. టెట్ ఉత్తీర్ణత చెల్లుబాటు కాలం ఏడేళ్లు మాత్రమేనంటూ 11 ఫిబ్రవరి 2011లో జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీఈటీ) జారీ చేసిన ఆదేశాలను తాజాగా కేంద్రం పక్కనపెట్టింది.

అలాగే, ఇప్పటికే ఏడేళ్లు పూర్తయిన వారికి ధ్రువీకరణ పత్రాలను పునరుద్ధరించడమో, లేదంటే కొత్త పత్రాలు జారీ చేయడమో చేయాలని సూచించింది. టీచింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వారికి ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది.