సూపర్ స్టార్ వదిలిన ‘గూడుపుఠాణి’ ఫస్ట్ లుక్

ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘గూడుపుఠాణి’. సప్తగిరి, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ను చిత్రయూనిట్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇదే టైటిల్‌తో సూపర్‌ స్టార్‌ కృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఫస్ట్‌ లుక్‌ విడుదల అనంతరం ఈ చిత్రం మంచి విజయం సాధించాలని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు సూపర్‌ స్టార్‌ కృష్ణ.

ఈ సందర్భంగా హీరో సప్తగిరి మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణగారు నటించిన గూడుపుఠాణి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. అదే టైటిల్‌తో నేను సినిమా చేయడం, కృష్ణగారు మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. దర్శకుడు కుమార్ కె.ఎం ఆసక్తికరంగా మూవీని తెరకెక్కించారు..” అని తెలుపగా..

”గూడుపుఠాణి సినిమా చాలా బాగా వచ్చింది. సప్తగిరిగారు చక్కగా నటించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది, హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్‌ మంగళూర్‌లోని అందమైన ప్రదేశాలలో ఈ చిత్రాన్ని షూట్‌ చేశాము. సూపర్ స్టార్ కృష్ణగారు మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం సంతోషంగా ఉంది” అని తెలిపారు నిర్మాతలు.

దర్శకుడు కుమార్ కె. ఎం మాట్లాడుతూ.. నా మొదటి సినిమా గూడుపుఠాణి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సప్తగిరితో తీశాను. ఆడియన్స్ సినిమా చూసి థ్రిల్ ఫీల్ అవుతారు. నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సూపర్ స్టార్‌గారు మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు.