ఆలయ ఆస్తుల విధ్వంసానికి సర్కారుదే బాధ్యత: జనసేనాని

రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై జనసేనాని పవన్ తీవ్రంగా స్పందించారు. శత్రు దేశమైన పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన నిందితులను అరెస్ట్ చేశారని ఉటంకించిన ఆయన.. సీఎం జగన్ ప్రభుత్వం ఆపాటి చర్యలు కూడా తీసుకోలేదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలయ ఆస్తుల విధ్వంసానికి సర్కార్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందూ విశ్వాసాలకు విఘాతం కలిగించే కుట్ర సాగుతోందని ఆరోపించారు. తాజాగా కర్నూలు జిల్లా మర్లబండలో ఆంజయనేయ స్వామి ఆలయ గోపురంపై ఉన్న సీతారామచంద్రుల విగ్రహాలను పగలగొట్టడం దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ఈ వరుస ఘటనలను ప్రతి ఒక్కరం ఖండించాలని పవన్ పిలుపునిచ్చారు.

గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు, విగ్రహాలకు అపవిత్రత జరుగుతున్నా ప్రభుత్వం కిమ్మనకుండా ఉండటం వల్లే మతోన్మాదులు మరింతగా తెగబడుతున్నారంటూ ఘాటగైన వ్యాఖ్యలు చేశారు పవన్. శక్తిపీఠం ఉన్న పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం ఘటన మొదలుకుని తాజాగా రామతీర్థం, రాజమహేంద్రవరం, మర్లబండ వరకూ విగ్రహాలను పగలగొడుతున్నా.. రథాలను తగలబెడుతున్నా.. ప్రభుత్వ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ విధానం మరిన్ని దేవాలయాల విధ్వంసానికి దారి తీసే ప్రమాదం ఉందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. వరుస దాడులకు పాల్పడుతున్న నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పవన్ డిమాండ్ చేశారు. అలాగే ధ్వంసానికి గురైన ఆలయాల పునరుద్ధరణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు.