అరకు ఘటన పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌లు..

అరకు ఘాట్‌రోడ్‌లో జరిగిన ప్రైవేటు టూరిస్టు ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదఘటన తనను తీవ్రంగా కలిచిపేసిందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే మెరుగైన చికిత్సను అందించాలని సంబంధిత అధికారులకు గవర్నర్ సూచించారు.

అరకు ఘాట్ లో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలం వద్ద శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డముకు 5 వ నంబర్ మలుపు వద్ద టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. మృతులంతా హైదరాబాద్ కు చెందిన వారని తెలుస్తుంది. బస్సులో మొత్తం 45 మంది ప్రయాణిస్తున్నారని సమాచారం. గాయపడిన వారిని విజయనగరం జిల్లా ఎస్. కోట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.