తుఫాను బాధిత రైతులకు ఆర్థిక సహాయం అందించాలి: నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు: మాండస్ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఆత్మకూరు నియోజకవర్గంలో రైతాంగం తీవ్ర నష్టానికి గురైంది. ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గంలో పత్తి, మిరప, వేరుశనగ, పొగాకు,మినుము తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒకవైపు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ సహాయ సహకారాలు అందక అల్లాడిపోతున్న రైతాంగాన్ని మాండస్ తుఫాన్ మరొకసారి దెబ్బతీసింది. ఆత్మకూరు నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇంత జరుగుతున్నా అధికార పార్టీ నాయకులు పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. ప్రత్యర్థి రాజకీయ పక్షాల నాయకులను తిట్టడానికి వరుసలో నాయకులను పంపుతూ, ఏ తిట్లు తిట్టాలో స్క్రిప్ట్ పంపే తాడేపల్లి పెద్దలు, ఇటువంటి విపత్కర పరిస్థితులలో రైతులకు అండగా ఉండమని తమ నాయకులకు ఎందుకు చెప్పరు. గత వ్యవసాయ సీజన్ కు సంబంధించి ధాన్యం బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా 320 కోట్లకు పైగా ఉన్నాయి. రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతుంటే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రతి ఒక్కరూ నిలదీయాలి. ఈ సీజన్లో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అగచాట్లు పడుతున్నారు. తేమశాతం పేరుతో రైతులను ఇబ్బందులు పాల్చేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.