రైతులకు హామీ.. రంగు మారిన ప్రతి గింజనూ కొంటాం

వర్షాల కారణంగా తడిచి రంగు మారిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందొద్దని రాష్ట్ర అధికారుల బృందం రైతులకు హామీ ఇచ్చింది. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అంగడిపేటలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం అధికారుల బృందం సందర్శించింది. రంగుమారిన ధాన్యాన్ని పరిశీలించిన అధికారులు.. శాంపిల్‌ తీసుకెళ్లారు. ఈ సమయంలో రైతులు అధికారులతో కొద్దిపాటి వాగ్వాదానికి దిగారు. తేమ సాకుతో, ధాన్యాన్ని కాంటా చేయకపోవడం, కాంటా చేసినా తరలించక కొనుగోలు కేంద్రాల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మోహన్‌రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి సైదులు మాట్లాడుతూ.. రైతులు ఆందోళనపడవద్దని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.