గుడివాడ అమర్నాథ్ టార్గెట్ గా.. జనసేన ఛలో విస్సన్నపేట

అనకాపల్లి నియోజకవర్గం, కశింకోట మండలం, విస్సన్నపేట గ్రామంలో వైసీపీ మంత్రి అమర్నాథ్ చేస్తున్న 609 ఎకరాల భూ దందాని క్షేత్రస్థాయిలో పరిశీలించి, బహిర్గతం చేసేందుకు గురువారం ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన నేతలు, జనసైనికులు పెద్ద సంఖ్యలో ఛలో విస్సన్నపేట కార్యక్రమం చేపట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా కొండలను సైతం మాయం చేసిన తీరు చూసి నాయకులు ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఒక మంత్రి కనుసన్నల్లో ఆయనకి చెందిన వ్యక్తులు ఈ స్థాయిలో భూ దందా చేయడం ప్రభుత్వ పనితీరుకి నిదర్శనంగా ఉంది అని నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తమ్మిరెడ్డి శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, పీఏసీ సభ్యులు కోన తాతారావు, రాష్ట్ర అధికార ప్రతినిది మరియు అనకాపల్లి ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు, అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్, చోడవరం ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు, అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య, భీమిలి ఇంచార్జ్ పంచకర్ల సందీప్, విశాఖ ఉత్తరం ఇంచార్జ్ పసుపులేటి ఉషాకిరణ్, ఇతర జిల్లా నాయకులు ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొండ మీద నిర్మించిన గెస్ట్ హౌస్ మరియు హెలిపాడ్ ని నేతలు పరిశీలించారు. ఆక్రమణకు గురైన గెడ్డ కాలువలు, అసైన్డ్ భూములు మరియు ప్రభుత్వ భూములను పరిశీలించారు. బలవంతంగా భూములు లాక్కున్న బాధితులతో నాయకులు మాట్లాడారు.