గులాబ్ తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని మళ్లింపు

గులాబ్ తుపాను నేడు తీరాన్ని దాటనున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయడమే కాకుండా మరికొన్నింటిని దారి మళ్లించినట్టు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. విశాఖపట్టణం, విజయవాడ వైపు వెళ్లే 10 రైళ్లు.. విశాఖ, విజయనగరం వైపు వెళ్లే ఆరు రైళ్లను నేడు రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే, విశాఖ మీదుగా రాకపోకలు సాగించే 6 రైళ్లను రేపు రద్దు చేస్తున్నట్టు వివరించారు. అలాగే, పూరీ-ఓఖా ప్రత్యేక రైలును నేడు ఖుర్దారోడ్, అంగూల్, సంబల్‌పూర్ మీదుగా దారి మళ్లించినట్టు తెలిపారు.  

రేపు విశాఖలో బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్రత్యేక రైలును జగదల్‌పూర్‌లో నిలిపివేయనున్నట్టు చెప్పారు. 28న తిరిగి అక్కడి నుంచి బయలుదేరుతుందని పేర్కొన్నారు. రైళ్ల రద్దు, దారి మళ్లింపు నేపథ్యంలో ప్రయాణికులు సహకరించాలని త్రిపాఠి కోరారు.