నాగబాబుకి జన్మదిన శుభాకాంక్షలు

అన్నయ్య శ్రీ నాగబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. నా చిన్ననాటి నుంచి నేటి వరకు నా వెన్నంటే ఉన్న శ్రీ నాగబాబు గారు నాకు ఎన్నో విషయాలలో స్ఫూర్తిగా నిలిచారు. ముఖ్యంగా నాకు పుస్తక పఠనంపై అమితాసక్తి కలగడానికి కారకులైన వారిలో శ్రీ నాగబాబు గారు కూడా ఒకరు. న్యాయ విద్యను అభ్యసించిన శ్రీ నాగబాబుగారు రాజ్యాంగపరమైన విషయాలు, సమకాలీన సామాజిక పరిస్థితులపై నిరంతరం అధ్యయనం చేస్తూనే ఉంటారు. ప్రముఖ న్యాయ కోవిదుడు శ్రీ నాని పాల్కీవాలా రచించిన వియ్ ది నేషన్ పుస్తకాన్ని నాకు బహూకరించి ‘ఈ పుస్తకం చదువు నీకు ఎంతో ఉపయోగపడుతుంది’ అని శ్రీ నాగబాబు గారు చెప్పిన మాటలు నాకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయాయి. రాజకీయ విషయాలలో చక్కటి అవగాహన, పరిజ్ఞానం ఉన్న శ్రీ నాగబాబు గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి జన సైనికులకు ఎంతో సేవ చేస్తున్నారు. అన్నయ్య శ్రీ నాగబాబు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నా తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు అని జనసేనాని పేర్కొన్నారు.