అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

సమాజ నిర్మాణానికి నిజమైన వాస్తు శిల్పి… స్త్రీ మూర్తి. తన కుటుంబాన్ని చక్కదిద్దడం నుంచి పరిపాలన, కార్య నిర్వహణ, వాణిజ్య వ్యాపారాలు, పరిశ్రమల నిర్వహణ వరకూ ప్రతి విభాగంలో మహిళామణులు తమ బాధ్యతను దిగ్విజయంగా పోషిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి స్వరూపిణి అయిన ప్రతి స్త్రీమూర్తికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నానంటూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అవసరమైన అండదండలు అందిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి 11.5 లక్షల మందికి దాదాపుగా రూ.4 వేల కోట్ల ప్రయోజనాలు కలిగించే దిశగా అడుగులు వేస్తున్నాము. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకాల ద్వారా అతివలు అధిక శాతం లబ్ధి పొందారు. స్త్రీ సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలు చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారికి ధన్యవాదాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల మూలంగా మహిళలకి ఆర్థికపరమైన అంశాలపై అవగాహన మెరుగవుతోంది. అతివలు ఆర్థికంగా బలోపేతం అయితే కచ్చితంగా ప్రతి కుటుంబం తద్వారా సమాజం బహుముఖంగా సంపన్నం అవుతుంది. ఈ క్రమంలోనే వారి రక్షణ బాధ్యతలు కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా తీసుకుంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా, వివిధ రూపాల్లో మహిళల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడే ప్రతి ఒక్కరిపైనా కఠినంగా వ్యవహరిస్తాము. మహిళల రక్షణ, సంక్షేమం మా ప్రభుత్వ బాధ్యత అని శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Share this content:

Post Comment