‘హరిహర వీరమల్లు’.. 3 విభిన్నగెటప్స్‌.. 30 రకాల కాస్ట్యూమ్స్‌

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ 27వ చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్‌ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 17వ శతాబ్దానికి చెంది మొఘల్‌ కాలం, కుతుబ్ షాహీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌ బందిపోటు పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమాలో పవన్‌ లుక్స్‌ గురించి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ఐశ్వర్యా రాజీవ్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “హరిహరవీరమల్లు పీరియాడిక్‌ డ్రామా. ఇందులో పవన్‌ కళ్యాణ్‌గారి కోసం ముప్పై రకాల దుస్తులను ఫైనల్‌గా ఎంపిక చేశాం. పవన్‌గారు ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రను ఇందులో పోషిస్తున్నారు. కాబట్టి కాస్ట్యూమ్స్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆయన దుస్తులు, లుక్‌ తీరు తెన్నులు ఎలా ఉండాలనే దాని గురించి చాలా రీసెర్చ్‌ చేశాం. ఇండియన్‌ సినిమాల్లో ఇప్పటి వరకు రానటువంటి కథతో సినిమా రూపొందుతోంది. అప్పటి మొఘల్‌ చక్రవర్తులను ఎదిరించిన వీరుడి కథ ఇది. కాబట్టి అప్పటి కాలానికి చెందిన బట్టలు, కట్టడాలు, లుక్స్‌ ఇలా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా చేశాం.

అసలు ఈ దుస్తులు గురించి పవన్‌కళ్యాణ్‌ ఏమంటారోనని అనుకున్నాను. కానీ రెండు రకాల దుస్తులను ప్రయత్నించిన తర్వాత వెంటనే ఓకే చెప్పేశారు. ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌ సహా ఇతరుల కాస్ట్యూమ్స్‌ కోసం ఇండియాలోని వేర్వేరే ప్రాంతాల్లోని 1000 థానుల ఫ్యాబ్రిక్స్‌ను తెప్పించి డిజైన్స్‌ ప్లాన్‌ చేశాం. వీటి కోసం నేనే స్వయంగా ఆ ప్రాంతాలకు వెళ్లాను. ఈ సినిమాకు పనిచేయడం సవాలుగా అనిపించింది. సినిమాలో పవన్‌కళ్యాణ్‌ మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. టీజర్‌లో పవన్‌ ధరించిన కడియం, పాదరక్షలను మనమే తయారు చేశాం. స్క్రిప్ట్‌, క్యారెక్టర్స్‌ను ఆధారం చేసుకునే మేం కాస్ట్యూమ్స్‌ను తయారు చేశాం” అన్నారు.