హయగ్రీవ జయంతి ప్రత్యేకత

శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజు భారతీయులంతా రాఖీ పండగను ఘనంగా జరుపుకొంటారు. ఈ రోజున మరో ప్రత్యేకత కూడా ఉంది అదే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవ స్వామీ జయంతి. హయగ్రీవున్ని జ్ఞానమునకు, వివేకమునకు, వాక్కుకు, బుద్ధికి, అన్ని విద్యలకు దేవుడుగా భావిస్తారు. హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడుగా పూజిస్తారు.

హయగ్రీవుడు, హయశీర్షగా కూడా పిలవబడుతున్నాడు. హయము అనగా గుర్రము. హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. తెల్లని తెలుపు మానవ శరీరం, గుర్రం (అశ్వము) యొక్క తల, నాలుగు చేతులు. శంఖము, చక్రము పై రెండు చేతులలో కలిగి యుండును. క్రింది కుడి వ్రేళ్ళు జ్ఞాన ముద్రలో అక్షరమాలను కలిగి యుంటాయి. ఏడమ చేతిలో పుస్తకము ఉంటుంది.

హయగ్రీవుడు జ్ఞాన ప్రదాత:

ఒకసారి మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, ఆ మధుకైటభులను వధించి… వేదాలను రక్షించాడు. వేదాలు జ్ఞానానికీ, వివేకానికీ చిహ్నాలు. ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హయగ్రీవుడు జ్ఞాన ప్రదాతగా భావిస్తారు. రాక్షసులు దొంగిలించిన వేదాలను ఈ హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతోంది.

హయగ్రీవుని పూజా ఫలితo:

శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవుని విశేషంగా పూజించాలి. ఈ స్వామిని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. భూవివాదాలు పరిష్కరించబడతాయి. న్యాయ పోరాటాలలో విజయం లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ప్రతిరోజు హయగ్రీవుని స్తుతి చేస్తే లక్ష్మీనారాయణుల శుభాశీస్సులతోపాటు సకల దేవతలు సంపూర్ణ శుభాశీస్సులు కూడా సంప్రాప్తమవుతాయి.

“జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్

ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే”

ఈ  స్తోత్రాన్ని హయగ్రీవ జయంతి రోజున ఎన్నిసార్లు వీలయితే అన్నిసార్లు పఠించడం వల్ల శుభాలు కలుగుతాయి.