*ప్రజావగాహనకే అంతర్జాతీయ యోగా దినోత్సవం
*వ్యాయామవిద్యకూ ఇదే ఊపు రావాలి
*నిమ్మరాజు చలపతిరావు
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రేరణతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలకు పైగా ప్రదేశాల్లో సామూహిక యోగాసనాలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన మళ్లీ సన్నిహితంగా మారడమే ఈ ఉత్సాహానికి ప్రేరణ కావొచ్చని విశ్లేషణ. ‘‘ఆరోగ్యానికి ఖర్చులేని మందు – శరీరం, మనస్సు సమతుల్యతకు యోగా’’ అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమంలో కనీసం 2 కోట్ల మందిని యోగాలో పాల్గొనేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే లక్షా 25 వేల మంది శిక్షకులను మాస్టర్ ట్రైనర్ల ద్వారా సిద్ధం చేశారు. ప్రధానమంత్రి మోదీ విశాఖలో ప్రధాన వేదికపై పాల్గొనబోతుండగా, రాష్ట్ర మంత్రులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో వ్యాయామ విద్యను పాఠశాలల నుంచి మాయచేసిన పాలకుల నిర్లక్ష్యాన్ని పలువురు మాజీ క్రీడా ఉపాధ్యాయులు విమర్శించారు. గతంలో విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడిన డ్రిల్ క్లాసులు, స్పోర్ట్స్ పీరియడ్లు ఇప్పుడు అదృశ్యమైపోవడం వల్లే నేడు యోగా వంటి కార్యక్రమాలపై ప్రభుత్వానికి భారీ ఖర్చులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాయామ విద్య, యోగా ఒకదానికొకటి భిన్నమైనా, లక్ష్యం మాత్రం ఒక్కటే – సంపూర్ణ ఆరోగ్యం. ఇకనైనా పాఠశాలల్లో వ్యాయామ విద్యకు ప్రాధాన్యం కల్పించి, యోగాను దీర్ఘకాలిక ఆరోగ్య సాధనగా తీర్చిదిద్దాలి అన్నది నిపుణుల సూచన.

Share this content:
Post Comment