హైదరాబాద్‌లో మళ్ళీ భారీ వర్షం

హైదరాబాద్‌లో కొద్ది సేపటి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో జోరు వాన పడుతోంది. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. లక్డీ కపూల్, ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, యూసఫ్ గూడ ప్రాంతాల్లో భారీ వర్షం మొదలయింది. అమీర్‌ పేట, పంజా గుట్ట, కూకట్‌ పల్లి మొదలగు చోట్ల కూడా కుండ పోత కురుస్తుంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అక్టోబర్ 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు, రేపు, ఎల్లుండి చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.